వనపర్తి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మళ్లీ ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ వైపు ఆశతో చూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన దీక్ష స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. వనపర్తి ఇన్చార్జి ఎలిమినేటి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. నాటి ఉద్యమ నేత కేసీఆర్ వల్లే తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు.
మలిదశ ఉద్యమానికి కేసీఆర్ దీక్షే పునాది: ఆర్ఎస్పీ
బాన్సువాడ రూరల్, నవంబర్ 27: కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ మలిదశ ఉద్యమానికి పునాది అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కామారెడ్డి జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బాన్సువాడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేపట్టిన దీక్షతో యావత్ తెలంగాణ కదిలి వచ్చిందని అన్నారు.
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ: ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నారాయణపేటరూరల్, నవంబర్ 27 : కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షతోనే తెలంగాణ ఏర్పడిందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేటలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంంలో కోటిరెడ్డి మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని అన్నా రు. మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 29న జిల్లావ్యాప్తంగా నిర్వహించే దీక్షాదివస్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ పోరాటం భావితరాలకు స్ఫూర్తి: విద్యాసాగర్‌రావు
జగిత్యాల టౌన్, నవంబర్ 27: కేసీఆర్ చేసిన దీక్షతో తెలంగాణ కల సాకారమైందని, ఆయన చేసిన అలుపెరుగని పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు కొనియాడారు. 29న దీక్షా దివస్‌ను పురస్కరించుకొని బుధవారం జగిత్యాలలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ఈ నెల 29న జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగే దీక్షా దివస్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజ య్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.