వనపర్తి : కేవలం ఢిల్లీ నాయకులను సంతృప్తి పరచడానికి, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం దెబ్బ తీసేలా రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ గాంధీ(Rajeev gandhi) విగ్రహం ఏర్పాటు చేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వనపర్తి పట్టణంలోని జమ్మి చెట్టు చౌరస్తా నుంచి బైక్ ర్యాలీ(Bike rally) నిర్వహించారు. గోపాల్ పేట మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ పట్ల మాకు గౌరవం ఉంది. దేశం కోసం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి పట్ల మాకు సానుభూతి ఉంది. రాజీవ్ గాంధీ మీద అంత ప్రేమ ఉంటే 30ఏండ్లుగా గాంధీ భవన్ ఎదుట విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
అంబేద్కర్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఇష్టం లేకనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆవిష్కరణ రాలేదన్నారు. అంబేద్కర్ సచివాలయం, అమరవీరుల స్థూపం మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలు రావడంతో సాధ్యం కాలేదు. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.