హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): కృష్ణా నీళ్లు సముద్రం పాలవుతుంటే కండ్లప్పగించి చూడటం తప్ప సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నదేమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘అంబలి కేంద్రాలకు నెలవైన పాలమూరును రెండేండ్లలోనే అన్నపూర్ణగా మార్చిన ఘన త కేసీఆర్‌ది అయితే.. పాలమూరు బీళ్లను ఎండబెడుతున్న నీచచరిత్ర సీఎం రేవంత్‌రెడ్డిది’ అని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనపై పాలమూరు జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరంజన్‌రెడ్డి ఖండించారు.కాంగ్రెస్ వందల కేసులు వేసి కుట్రలు చేసినా వాటిని చేధించి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90 శాతం పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌దని స్పష్టంచేశారు. రూ.200 కోట్లు ఇస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఎలక్ట్రిక్ పనులు ముందుకు సాగుతాయని, దురదృష్టవశాత్తు వాటిని ఇచ్చే తీరిక సీఎం కు లేదని విమర్శించారు.
వట్టెం పంప్‌హౌస్ నీట మునిగితే ప్రాజెక్టుల పరిశీలన పేరుతో పర్యటన పెట్టుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పంప్‌హౌస్ వైపే చూడలేద ని, పాలమూరు ఎత్తిపోతల కింద నిర్మించి న రిజర్వాయర్లలో నీళ్లు నింపే అవకాశం ఉన్నా 11 నెలలుగా ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. 11 నెలల పాలనలో రేవంత్‌రెడ్డికి 25 సార్లు ఢిల్లీకి, అనేకసార్లు ఇతర రాష్ర్టాలకు, మూడు సార్లు విదేశాలకు వెళ్లే తీరిక దొరికిందిగాని, పాలమూరు ప్రాజెక్టుల గురించి చర్చించే సమయం లేదా ? అని ప్రశ్నించారు.
దశాబ్దాలుగా పడావుపడ్డ పనులను పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌ది అని, పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి కల్వకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తిచేసి 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చారని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. రాజీవ్ భీమా కింద 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు, నెట్టెంపాడు కింద 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు, ఆర్డీఎస్ తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద 87 వేల ఎకరాల ఆయకట్టుకు, కోయిల్‌సాగర్ కింద 38 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లిచ్చారని వివరించారు.
దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించిన చరిత్ర కేసీఆర్‌ది అని ఉదహరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో 90 శాతం పనులు పూర్తి చేశారని వివరించారు.కాంగ్రెస్ 11 నెలల పాలనలో ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. పాలమూరు జిల్లాలో 5 ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కళాశాలలు, అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాల, మత్స్య కళాశాల, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల, వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలను కేసీఆర్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇన్ని పనులు చేసిన కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యం ఎక్కడ కనిపించిందని ప్రశ్నించారు.