హైదరాబాద్: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టు చాలా దారుణమని మండి పడ్డారు. ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. విదేశాల నుంచి వస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు.
మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్‌కి తరలించారు. ఎమ్మెల్యే తరచూ బెరదింపులకు దిగుతున్నాడని, రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మనోజ్‌రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై 308(2), 308(4), 352 బీఎన్ఎస్ సెక్షన్ల కింద సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.