హైదరాబాద్: పాలమూరు జిల్లాను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. కాంగ్రెస్ వందల కేసులు వేసినా కుట్రలను చేధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (PRLIS) 90 శాతం పనులు పూర్తి చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిదని చెప్పారు. కేవలం రూ.200 కోట్లు ఇస్తే ఎత్తిపోతల పథకంలో ఎలక్ట్రికల్ పనులు ముందుకు సాగుతాయన్నారు. పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి కనీసం రూ.200 కోట్లు ఇచ్చే తీరిక లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 339 రోజులు గడుస్తున్నా పాలమూరు బిడ్డకు ఈ ప్రాంత ప్రాజెక్టుల మీద అర్ధగంట సమీక్ష చేసే తీరిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే ప్రాజెక్టుల పరీశీలన పేరుతో పర్యటన పెట్టుకున్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పంప్ హౌస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. కనీసం సమీక్ష చేయలేదని వెల్లడించారు. కృష్ణా నీళ్లు సముద్రం పాలవుతుంటే కళ్లప్పగించి చూస్తున్నారని, మీది నిర్లక్ష్యమా.. కేసీఆర్‌ది నిర్లక్ష్యమా.. అని ప్రశ్నించారు.
కేవలం 40 నుంచి 50 రోజులు పనిచేస్తే పాలమూరు ఎత్తిపోతల కింద నిర్మించిన రిజర్వాయర్లలో నీళ్లు నింపుకునే అవకాశం ఉందని, అయినా 11 నెలలుగా ప్రభుత్వం పనులను గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు మల్లొచ్చే వానాకాలం వరకు సాగునీళ్లను కోల్పోయినట్లేనని చెప్పారు. గత 11 నెలల్లో సీఎం రేవంత్ 26 సార్లు ఢిల్లీకి, పలుమార్లు పక్క రాష్ట్రాలకు, మూడు సార్లు విదేశాలకు వెళ్లే తీరిక దొరికింది కానీ పాలమూరు ప్రాజెక్టుల గురించి చర్చించే సమయం లేదా అని ప్రశ్నించారు. మహరాష్ట్ర, కేరళ, యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి తిరగడానికే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. ఇక పాలన మీద, ప్రజల సమస్యల మీద స్పందించే సమయం ఎక్కడ ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం ఒరగబెట్టారని కాళ్లలో కట్టెలు పెట్టొద్దు, అభివృద్ధికి అడ్డుపడితే మట్టి మనుషుల చెమటలో కొట్టుకుపోతారు అంటూ భారీ డైలాగులు కొడుతున్నారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలో కేసీఆర్ పాలమూరు జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, కాంగ్రెస్ పాలనలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి 3.50 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారని చెప్పారు. రాజీవ్ భీమా కింద 1.50 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడు కింద 1.40 వేల ఎకరాలు, ఆర్డీఎస్ తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద 87 వేల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 38 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారని గుర్తుచేశారు. దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులగా మర్చి 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించారని తెలిపారు. అంబలి కేంద్రాలకు నెలవైన పాలమూరును అన్నపూర్ణను చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు.
తాగునీటికి తండ్లాడిన పాలమూరులో ఇంటింటికి నల్లాలిచ్చారని, జిల్లా వ్యాప్తంగా 100కు పైగా చెక్ డ్యాంలు నిర్మించారన్నారు. ఒక్క మెడికల్ కళాశాల లేని పాలమూరు జిల్లాకు ఐదు ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఏజీబీఎస్సీ కళాశాల, మత్స్య కళాశాల, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల, వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది కేసీఆర్ నిర్లక్ష్యంగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. పేద, దళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఈ గురుకుల పాఠశాలలు బాటలు వేశాయని, మీకు చిత్తశుద్ది ఉంటే వాటికి శాశ్వత వసతులు కల్పించాలన్నారు.
కురుమూర్తి స్వామి మీద, జోగుళాంబ అమ్మవారు, మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి మీద ఒట్లు వేసి, ప్రమాణాలు చేసి రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మాటతప్పారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రమాణాలు చూసి దేవుళ్లు గుళ్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలకు ప్రమాణాలు, ఇమానాలు అంటే నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. వెంటనే నిధులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామంటే ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా రుణం తీర్చుకుంటారని చెప్పారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఊరికి, ప్రతి తండాకు రహదారులు నిర్మించామన్నారు. ప్రతి గల్లీలో సీసీ రహదారులు వేశామని, మిగిలిపోయినవి ఏమయినా ఉంటే వెంటనే నిధులు విడుదల చేసి పూర్తి చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రభుత్వ భవనాలు, ప్రాజెక్టులు, రహదారులు, సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పునాది తీసింది లేదు, పూర్తి చేసింది లేదని విమర్శించారు. గత ప్రభుత్వం వివిధ పనుల నిమిత్తం మంజూరు చేసిన నిధులను రద్దు చేశారని వెల్లడించారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నదని చెప్పారు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ అవే అబద్దాలు వల్లె వేస్తున్నారని విమర్శించారు.