వనపర్తి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ‘ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాన్ని మోదీ సర్కారు నాన్చుతోందని.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునివ్వాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యతగల ప్రతిపక్షంగా బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆ ధర్నాలో పాల్గొంటారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. నదీ జలాల్లో నీటి వాటా తేల్చాలని, రెండు రాష్ర్టాల నీటి వినియోగానికి చట్టబద్ధత కల్పించాలని దశాబ్ద కాలంగా మొరపెట్టుకున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై యుద్ధం అంటూ ప్రగల్భాలు పలికే సీఎం రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నలుగుతున్న జల సమస్యను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు.
రాజ్‌భవన్ ఎదుట ధర్నాలు చేపట్టి రాజకీయ డ్రామాలకు తెరలేపారని, శాశ్వత నదీజలాల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేయడం లేదని విమర్శించారు. తాము అనేక దఫాలు కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం వంటి చేశామని గుర్తుచేశారు. అయినా బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇంతలా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఒక్కరోజైనా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పీఎంను అడగడం లేదని ధ్వజమెత్తారు.
ఈ ఏడాది వానకాలం సీజన్ నుంచి ఇప్పటి వరకు ఏపీ 660 టీఎంసీల నీటిని వాడుకున్నదని తెలిపారు. రోజూ పది వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ నుంచి తరలిస్తుంటే రేవంత్‌రెడ్డికి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటిని అక్రమంగా వాడుతున్నా ఏపీ చర్యలపై మాట్లాడమంటే గత ప్రభుత్వం అంటూ పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో 30 దఫాలకుపైగా సీఎం ఢిల్లీ వెళ్లారే తప్ప ఒక్క పని కూడా సాధించలేదని ఎద్దేవా చేశారు.