ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పిచ్చికి పరాకాష్ట అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారని, ఆ తప్పులకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సాక్షులుగా విచారిస్తున్నామంటూ దోషులుగా ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో సిట్ తీరు, కాంగ్రెస్, ఒక వర్గం మీడియా పాత్ర అనుమానాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. విచారణ పేరుతో రెండేండ్లుగా బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం వేధిస్తున్నదని మండిపడ్డారు.
కొండను తవ్వాం అంటూనే.. ప్రభుత్వం ఎలుకను కూడ పట్టలేదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు, ప్రచారానికి పొంతన లేకుండా ఉన్నదని పేర్కొన్నారు. రెండేండ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని తెలిపారు. సిట్ విచారణ పేరుతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అని ఆశ చూపి, ఉన్న పథకాలను గంగలో కలిపారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మాజీమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడి ్డ స్పందించారు. కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌పై కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. బొగ్గుస్కామ్‌పై సమాధానం చెప్పే దమ్ములేకనే సీఎం రేవంత్ వరుసగా నోటీసుల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

పాలనా వైఫల్యాన్ని, కాంగ్రెస్ వరుస స్కామ్‌ల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు ఇచ్చారని విమర్శించారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారని స్పష్టంచేశారు. కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం అంతా ఉందని, ప్రభుత్వం పెట్టే కేసులు, నోటీసులకు భయపడేది లేదని అక్రమ కేసులపై ప్రజాక్షేత్రంలోనే బీఆర్ఎస్ తేల్చుకుంటుందని తేల్చిచెప్పారు.
తెలంగాణ సాధకుడు కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపులకు పరాకాష్ట అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే సిట్లు వేసి నోటీసులు జారీచేస్తూ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావును వేధిస్తున్నారని ఆరోపించారు.

ప్రస్తుత మంత్రివర్గం దండుపాళ్యం బ్యాచ్‌గా మారి, రోజుకో కుంభకోణానికి పాల్పడుతున్నదని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు పనిచేయకుండా, కేసుల చుట్టూ తిరిగేలా కుట్రతోనే రేవంత్ సర్కార్ సిట్ పేరుతో నోటీసులు, విచారణ అంటూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కేసీఆర్‌ను వేధిస్తే ఆ ఉసురు ఈ ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి తగలకుండా పోదని హెచ్చరించారు. న్యాయం, ధర్మం బీఆర్ఎస్ వైపే ఉన్నాయని, ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.