లగచర్ల బాధితులకు నిరంజన్ రెడ్డి భరోసా
నారాయణపేట, డిసెంబర్ 16 : వికారాబాద్ జిల్లా లగచర్ల బాధితులు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు భరోసా కల్పించారు. సోమవారం చర్లపల్లి జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు లగచర్ల, రోటిబండ తండా, హకీంపేట, పులిచర్ల, దుద్యాల, పోలేపల్లి గ్రామాల రైతులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఫార్మా కంపెనీ పేరుతో రైతులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కేసులను వెనక్కి తీసుకొని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు లగచర్ల గ్రామ రైతులకు బెయిల్ మంజూరుపై నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో మంగళవారం వాదనలు కొనసాగనున్నాయి.