మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు తొమ్మిదోరోజు (SLBC Tunnel Rescue) కొనసాగుతున్నాయి. టన్నెల్లో 8 మంది ఎక్కడున్నారో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. 15 అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయడం రెస్క్యూ బృందాలకు సవాల్‌గా మారింది. ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తుంటే మళ్లీ వరదలా వచ్చి పేరుకుపోతున్నది. పైభాగంలో తవ్వుతున్నా కొద్దీ కింది భాగం నుంచి ఊట ఉబికి వస్తున్నది. అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్నా, మళ్లీ చేరుతున్న నీరు, బురదతో రెస్క్యూ బృందాలకు ఇబ్బందులు తప్పడం లేదు.
రెండు టన్నెల్ భాగాల మధ్యలో నలుగురు, టన్నల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో నలుగురు చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. టీబీఎం మధ్య ఏడు మీటర్ల లోతులో ఉన్న నాలుగు మృతదేహాలను ఆదివారం సాయంత్రం వరకు వెలికితీయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికోసం సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరో నాలుగు మృతదేహాలను తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెబుతున్నాయి. ఘటనా స్థలం సమీపంలో 8 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉం చారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను వారి స్వ స్థలాలకు పంపిదుకు ఏర్పాట్లుచేస్తున్నారు. కనీసం తమ వారి మృతదేహాలైనా చూస్తా మా? అని బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
కాగా, షిఫ్టుకు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. మొత్తం 18 ఏజెన్సీలు, 54 మంది అధికారులు,703 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.