హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) నిర్వహణ నేటి ప్రభుత్వం పుణ్యమా అని దశా దిశ లేకుండా పోయింది. నిమ్స్ తరహాలోనే స్వయం ప్రతిపత్తి హోదాతో టిమ్స్‌ను ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో నిర్మించిన టిమ్స్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. ఇదిగో ప్రారంభిస్తున్నాం, అదిగో ప్రారంభిస్తున్నామంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ సర్కార్ టిమ్స్ ప్రారంభాన్ని గత రెండు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నది. మరో విచిత్రమేంటంటే దవాఖానలో ఓపీ సేవలపై ఇప్పటికే ట్రయల్ రన్ ప్రారంభించిన సర్కార్‌కు అసలు టిమ్స్ నిర్వహణ బాధ్యతలు ఎవరి పరిధిలోకి వస్తాయో స్పష్టత లేకపోవడం గమనార్హం.
వెయ్యి పడకల సామర్థ్యం గల టిమ్స్‌లో వైద్య సిబ్బంది, టెక్నికల్, నర్సింగ్ తదితర సిబ్బంది కోసం ఇప్పటి వరకు రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేపట్టకపోవడం గమనార్హం. వైద్యులు, ఫ్యాకల్టీని నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, మానసిక రోగుల దవాఖాన, నిమ్స్, ఇతర టీచింగ్ హాస్పిటల్స్ నుంచి మొత్తం 180 మందిని టిమ్స్‌కు డిప్యుటేషన్‌పై వేశారు. అదే క్రమంలో నర్సింగ్, ఇతర సిబ్బందిని సైతం ఆయా టీచింగ్ హాస్పిటల్స్ నుంచి కొంత మందిని టిమ్స్‌కు కేటాయించారు. ప్రస్తుతం టిమ్స్ పర్యవేక్షణ అంతా డీఎంఈ పరిధిలో కొనసాగుతున్నది. అయితే టిమ్స్‌లో ఉద్యోగుల నిర్వహణ కోసం కనీసం హెచ్ఆర్ను నియమించకపోవడం, ఇప్పటి వరకు ఒక పరిపాలనాధికారిని నియమించకపోవడం టిమ్స్ నిర్వహణకు అద్ధం పడుతున్నది.
డీఎంఈ పర్యవేక్షణలో ఉన్న టిమ్స్‌కు ఉద్యోగాల భర్తీ బాధ్యతలను మాత్రం నిమ్స్‌కు అప్పగిస్తూ నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో అసలు ఎవరు ఎవరికింద పనిచేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నది. పర్యవేక్షణేమో డీఎంఈ పరిధిలో, కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగ నియామకాలేమో నిమ్స్ పరిధిలో చేపడుతున్నారు. అంటే టిమ్స్‌లో పనిచేయాల్సిన టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు నిమ్స్‌లో భర్తీ కావాలి. ఆ తరువాత వారిని నిమ్స్ యాజమాన్యం టిమ్స్‌కు సంవత్సరం కాలం పాటు కేటాయిస్తుంది. ఈ క్రమంలో సతన్‌నగర్ టిమ్స్‌లో పనిచేయడానికి మొత్తం 122మంది నాన్ క్లినికల్ సిబ్బంది, 31మంది మెడికల్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ పద్ధతిన రిక్రూట్ చేసేందుకు నిమ్స్ నోటిఫికేషన్ జారీచేసింది. ఎంపికైన సిబ్బందికి నిమ్స్ యాజమాన్యమే వేతనాలు చెల్లిస్తుంది. అయితే వైద్యులు డీఎంఈ పరిధిలో నుంచి, ఇతర సిబ్బంది నిమ్స్ నుంచి కేటాయించడం వల్ల పాలనాపరంగా, సాంకేతికపరంగా పలు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు, సిబ్బంది మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్ సేవలు ఇప్పట్లో ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రశ్నార్థకమనే విమర్శలు వినిపిస్తున్నాయి. దవాఖానలో ట్రయల్ రన్ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ అవసరమైన కనీసం సిబ్బంది లేరని, వైద్య పరికరాలు, సరైన మౌలిక సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్లు వంటివి ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదని తెలుస్తున్నది. దీనికి తోడు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ తదితర కీలక విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది నియామకం కూడా పూర్తికాకపోవడంతో సనత్‌నగర్ టిమ్స్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.