హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్, తెలంగాణకు చెందిన సమీర్‌ను 5 రోజులపాటు పోలీస్ కస్టడీకి తరలించేందుకు స్థానిక కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో విజయనగరం జిల్లా పోలీసులు గురువారం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో కలిసి ఈ ఇద్దరు నిందితులను విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏకి చెందిన ఉన్నతస్థాయి విచారణ బృందం విజయనగరానికి చేరుకుని, ఆ జిల్లా పోలీసుల నుంచి వివరాలు సేకరించింది. నిందితులు పేలుడు పదార్థాలను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నారని, ఆ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఓ హ్యాండ్లర్ పర్యవేక్షణలో రిమోట్‌తో పేల్చగలిగే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)లు తయారు చేయడం నేర్చుకుంటున్నారని తేల్చారు.
ఈ కేసులో దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు.. సిరాజ్ బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్టు గుర్తించి, వాటిని సీజ్ చేశా యి. డీసీసీ బ్యాంక్‌లో సిరాజ్‌కు చెందిన లాకర్‌ను తెరిచేందుకు అతని తండ్రి (ఏఎస్సైగా పనిచేస్తున్నారు) విఫలయత్నం చేసినట్టు తెలుస్తున్నది. కానీ, అప్పటికే ఆ ఖాతాను సీజ్ చేసినందున లాకర్‌ను తెరవడం కుదరదని బ్యాంక్ అధికారులు చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై సిరాజ్ తండ్రి రెండు రోజులపాటు బ్యాంక్ అధికారులను కలిసినట్టు తెలుస్తున్నది. దీంతో సిరాజ్ తండ్రి, కుటుంబసభ్యులతోపాటు సమీర్ కుటుంబసభ్యుల కదలికలపై మరింత నిఘా పెంచాయి.