హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హైదరాబాద్‌తో పాటు హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్ విద్యానగర్‌లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఇంతకు ముందు జూన్‌లో రంగారెడ్డి, మెదక్ జిల్లాలు, సికింద్రాబాద్‌లోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. హైకోర్టు న్యాయవాది చుక్కా శిల్ప, దేవేంద్ర, స్వప్నలను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
విద్యార్థిని రాధ మావోయిస్టుల్లోకి రావడంలో నిందితుల ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. రాధను చైతన్య మహిళా సంఘం నేతలు కిడ్నాప్ చేశారని రాధ తల్లి గతంలో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మావోయిస్ట్ రిక్రూట్మెంట్ కేసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే హనుమకొండలోని చైతన్య మహిళా సంఘం నాయకురాలి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎంఎస్ నాయకురాలు అనితను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనిత ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో ఎన్ఐఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం.