హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కంచె గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల్లో పర్యావరణ విధ్వంసంపై జాతీయ మానవ హకుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ) దూకుడు పెంచింది. ఇష్టారీతిన పచ్చని అడవిని బుల్డోజర్లతో చెరబట్టిన రాష్ట్ర ప్రభుత్వం పై, ఆ దారుణాన్ని అడ్డుకుంటున్న విద్యార్థులను అక్రమంగా జైలుకు పంపిన పోలీసులపై కేసు నమోదుచేసింది. హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అర్ధరాత్రి బుల్డోజర్లను హెచ్‌సీయూ భూముల్లోకి దించి.. అటవీ విధ్వంసానికి పాల్పడింది. దీంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ కన్నెర్రజేశాయి. ఇదే క్రమంలో న్యాయవాది ఇమ్మని రామారా వు హెచ్‌సీయూలో జంతుజాలాన్ని కాపాడాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు మార్చి 2న ఫిర్యాదు చేశారు.
హెచ్‌సీయూలో గతంలో చేసిన సర్వే సెచ్‌లో ఈ ప్రాంతంలో 27 ఎకరాల సరస్సు, 134.28 ఎకరాల షీట్ రాక్స్, 2.33 ఎకరాల కుంటతోపాటు రాష్ట్ర జంతువు, మచ్చల జింకలు, పలు రకాల అరుదైన జీవజాలం కూడా ఉన్నాయని, ప్రభుత్వం బుల్డోజర్లతో అడవిని ధ్వంసం చేస్తుండటంతో వాటి ఉనికి ప్రమాదంలో పడిందని న్యాయవాది రామారావు ఎన్‌హెచ్చార్సీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దుశ్చర్య వల్ల ప్రజానీకం, జీవజాలం, జంతు, పర్యావరణ ప్రేమికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ కేసులో ప్రజ లే బాధితులని పేర్కొన్నారు. దీంతో స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఫిర్యాదును స్వీకరించింది.
ఈనెల 20న తమ డైరీలో ఎంట్రీ చేసి.. 7114/ఏఎన్/2025 నంబర్‌ను ఇచ్చింది. దీంతోపాటు కేసు నమోదుచేసింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడైన న్యాయవాది రామారావుకు కేసు నమోదైనట్టు (823/ 36/9/2025) మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. హెచ్‌సీయూ అం శంలో ప్రతివాదులుగా న్యాయవాది రామారావు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులను చేర్చడంతో వారిపైనే ఎన్‌హెచ్చార్సీ కేసు నమోదు చేసింది.