హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ప్రాంతీయ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగాన్ని 6 లేన్లుగా నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో ఎన్హెచ్ఏఐ అధికారులు ఓవైపు ట్రాఫిక్ అధ్యయనం చేపట్టడంతోపాటు మరోవైపు ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను 6 లేన్లకు అనుగుణంగా సవరిస్తున్నారు. అయితే, ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచినందున మళ్లీ కొత్తగా టెండర్లు ఆహ్వానించకుండా వాటినే కొనసాగించాలని నిర్ణయించారు.
ట్రిపుల్ఆర్ను 4 లేన్లతో నిర్మిస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున 6లేన్లుగా ఏ ర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ విజ్ఞప్తికి కేంద్రం ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు ఎన్హెచ్ఏఐ ట్రిపుల్ఆర్ను 6 లేన్లుగా మారుస్తూ డీపీఆర్‌ను సవరించడంతోపాటు ట్రిపుల్ఆర్ మార్గంలో ట్రాఫిక్‌పై అధ్యయనం చేపట్టింది. ఉత్తర భాగం నిర్మాణానికి ఇదివరకే టెండర్లను ఇదివరకే ఆహ్వానించినందున మళ్లీ కొత్తగా పిలిచే అవకాశం లేదని, సవరించిన డీపీఆర్‌కు అనుగుణంగా ఏజెన్సీలు తమ బిడ్ డాక్యుమెంట్లను సమర్పిస్తే సరిపోతుందని అధికారులు చెప్తున్నారు.
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను రూపొందిస్తున్నది. అందుకోసం ఇటీవల ఓ ఏజెన్సీని నియమించింది. వాస్తవానికి దక్షిణ భాగం పనులను చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను తయారు చేయించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.