Telangana | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారం మరింత జటిలంగా మారింది. లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచి చెల్లిస్తామని చెప్తున్నా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంలేదు. రైతుల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అప్రమత్తమైంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యాకే నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించినట్టు ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్పష్టం చేయడంతో.. రైతులకు అడ్వాన్సులు చెల్లించకపోతే భూములు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో అవార్డ్ అయిన భూములను కూడా ఇంకా ఎన్హెచ్ఏఐ స్వాధీనం చేసుకోలేదు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) సహా ఇతర జాతీయ రహదారుల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ భూసేకరణ చేపట్టిన విషయం విదితమే. అందుకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తే ఎన్హెచ్ఏఐ నష్ట పరిహారం చెల్లిస్తుంది. ట్రిపుల్ఆర్ విషయంలో కూడా ఇదే విధానం అమలవుతున్నప్పటికీ నష్టపరిహారంలో సగభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఆర్ కోసం సేకరించాల్సిన భూముల్లో ఇప్పటికే 95% భూములకు అవార్డ్లు పాస్ చేసినప్పటికీ నష్టపరిహారం చెల్లింపు ఇంకా పెండింగులోనే ఉన్నది. మిగిలిన 5% కూడా పూర్తయితే ఒకేసారి మొత్తం నష్టపరిహారాన్ని చెల్లిస్తామని ఎన్హెచ్ఏఐ చెప్తుండగా.. అవార్డ్ పాస్ అయిన భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించి, టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. ఈ వాద ప్రతివాదనల వల్ల ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుతోపాటు ఇతర రహదారుల పనులు కూడా ముందుకు సాగడంలేదు.
హైదరాబాద్-మన్నెగూడ సెక్షన్ (ఎన్‌హెచ్-163) పనులకు అగ్రిమెంట్ జరిగి మూడేండ్లు అవుతున్నా పనుల పురోగతి మాత్రం ‘ఎకడ వేసిన గొంగళి అకడే’ అన్నట్టుగా ఉన్నది. 46 కి.మీ. పొడవైన ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల్లో ఇప్పటికే 92% సేకరణ పూర్తయింది. మిగిలిన 8% భూసేకరణ మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ మొత్తం రోడ్డు నిర్మాణ పనులను పెండింగ్‌లో పెట్టడం ఏమిటని మంత్రి కోమటిరెడ్డి ఇటీవల ఎన్హెచ్ఏఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌరెల్లి-వలిగొండ (ఎన్‌హెచ్-930పీ) రహదారి నిర్మాణంలోనూ భూసేకరణ సమస్యగా మారింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్-భద్రాచలం మధ్య ప్రయాణ దూరం దాదాపు 150 కి.మీ. తగ్గుతుంది. కానీ, ఈ మార్గం నిర్మాణానికి కొంత మేర అటవీ భూములను సేకరించాల్సి ఉండటం, భూములు కోల్పోతున్నవారికి నష్టపరిహారం చెల్లింపు పెండింగ్‌లో ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు.
హైదరాబాద్-శ్రీశైలం (ఎన్‌హెచ్-765) రహదారి అభివృద్ధిలో భాగంగా తుకుగూడ-డిండి మధ్య నిర్మించతలపెట్టిన రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాల్సివుంది. ఈ రహదారిని విస్తరణకు మిషన్ భగీరథ పైప్లైన్లు అడ్డంకిగా మారడంతో ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందుకోసం రైతుల నుంచి భారీగా భూములు సేకరించాల్సి ఉంటుంది. దాదాపు 65 కి.మీ. పొడవున నిర్మించ తలపెట్టిన శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సైతం భారీగా అటవీ భూములను సేకరించాల్సి ఉన్నది. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా అటవీశాఖకు వేరే భూములు అప్పగించాల్సి ఉంటుంది.
ఆర్అండ్బీ శాఖ పరిధిలోని జాతీయ రహదారుల్లో ఖమ్మం-కురవి (ఎన్‌హెచ్-365ఏ) పనులకు కూడా భూసేకరణ అడ్డంకిగా మారింది. మద్నూర్-బోధన్ (ఎన్‌హెచ్-161బీబీ), సిరోంచ-ఆత్మకూర్(ఎన్‌హెచ్-353సీ) రహదారుల భూసేకరణ కూడా పూర్తికాలేదు. 2024-25 వార్షిక ప్రణాళికలో పేరొన్న 13 రోడ్లలో నిజామాబాద్-జగదల్పూర్ (ఎన్‌హెచ్-63), కొత్తగూడెం బైపాస్ (ఎన్‌హెచ్-30), హుజూర్నగర్ బైపాస్ (ఎన్‌హెచ్-167), ఖమ్మం బైపాస్ (ఎన్‌హెచ్-163జీ), హైదరాబాద్-పాలపట్నం(ఎన్‌హెచ్-163)లోని మేజర్ బ్రిడ్జీలతోపాటు నకిరేకల్-దామరచర్ల (ఎన్‌హెచ్-365) తదితర రోడ్ల నిర్మాణానికి డీపీఆర్‌లు రూపొందించాల్సి ఉన్నది.