హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్లు వెచ్చించనున్న మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్ పనుల్లో అక్రమాలు, అవినీతి, చట్ట ఉల్లంఘనలు జరిగితే తాము విచారణ చేస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ తేల్చిచెప్పింది. పర్యావరణ అనుమతులు పొందాక వాటిని ఉల్లంఘిస్తూ పనులు చేపడితే.. ఆ ఆధారాలతో తిరిగి తమ వద్దకు రావచ్చునని పిటిషనర్, బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డికి సూచించింది. ఈ మేరకు ఎన్డీటీ జ్యుడీషియల్ సభ్యుడు పుష్ప సత్యనారాయణ, సాంకేతిక సభ్యుడు ప్రశాంత్ గార్గవ్తో కూడిన ధర్మాసనం ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల కాపీ శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. అనుమతులు పొందే ప్రాథమిక దశలో ప్రాజెక్టు ఉన్నందున పిటిషన్‌పై విచారణ చేపట్టబోమని స్పష్టంచేసింది. పిటిషన్‌ను కొట్టేస్తూనే.. పనులు ప్రారంభించాక పర్యావరణ, జలవనరుల, జీవ వైవిధ్య ఉల్లంఘనలు జరిగితే.. మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు పిటిషనర్‌కు అనుమతినిచ్చింది.
మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా పనులు చేపడుతున్నదంటూ బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తూ, ముందస్తు అనుమతులు పొందకుండా పను లు కొనసాగిస్తున్నదని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జీ రాజగోపాలన్ వాదనలు వినిపిస్తూ.. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు పొందకుండా పనులు చేపట్టడం చట్టవ్యతిరేకమని అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత ప్రాంతాలకు 10 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే పనులతో పర్యావరణంపై పడే ప్రభావం మీద అధ్యయనం చేయాలన్న నిబంధనను ప్రభుత్వం ఉల్లంఘించిందని చెప్పారు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు లేకుండానే పనులు చేయడం చట్ట వ్యతిరేకమని తెలిపారు.
మూసీ అభివృద్ధి పేరుతో చేపడుతున్న ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 పరిధిలోకి వస్తుందని న్యాయవాది రాజగోపాలన్ తెలిపారు. కాబట్టి పనులు చేపట్టడానికి ముందే పర్యావరణ అనుమతులు పొందాలని, కానీ ఈ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ ప్రభావ అధ్యయనం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తదితర కీలక అంశాల జోలికి వెళ్లకుండా పనులు చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం జాతీయ ఆనకట్ట భద్రతా చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, పర్యావరణ చట్టం, ఇతర చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని న్యాయవాది తెలిపారు. మూసీ నది పరిసరాల్లోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ సరస్సులు హైదరాబాద్‌కు కీలకమైన తాగునీటి వనరులని, అవి జీవవైవిధ్యానికి కేంద్రంగా ఉన్నాయని చెప్పారు. ‘ఈ ప్రాంతంలో సుమారు 249 పక్షి జాతులు, అనేక జలచరాలు, వన్యప్రాణులు నివసిస్తున్నాయి. ఇప్పుడు మూసీ అభివృద్ధి పేరుతో పనులు కొనసాగితే వాటి మనుగడు దెబ్బతినే ప్రమాదం ఉంది. నది వెంట భారీ నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతిస్తే, జీవవైవిధ్యం దెబ్బతీనే ప్రమా దం ఉంటుంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు.
‘మూసీ నదికి పది కిలోమీటర్ల దూరంలో జాతీయ పారు ఉంది. ఇది పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం. ఈ తరహా ఎకో సెన్సిటివ్ ఏరియాల్లో నిర్మాణాలు చేయాలంటే కేంద్రం నుంచి విధిగా అనుమతులు పొందాలి. ఆ అనుమతులు పొందకుండానే తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టడం చెల్లదని ప్రకటించాలి. ఇప్పటికే మూసీ నది కాలుష్యంతో తీవ్రంగా దెబ్బతిన్నది. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు నామమాత్రంగానే ఉన్నది. ఈ పరిస్థితుల్లో భారీ నిర్మాణాలు చేపట్టడం వల్ల కాలుష్యం పెరుగడమే కాకుడా జీవవైవిధ్యానికి, పర్యావరణానికి పెను ముప్పు ఎదురవుతుంది. ఇటీవల ప్రాజెక్ట్ పనుల కోసం పెద్ద ఎత్తున చెట్లను నరికి వేయడాన్ని కూడా ఎన్జీటీ తీవ్రంగా పరిగణించాలి’ అని న్యాయవాది విజ్ఞప్తిచేశారు. ప్రభు త్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో వాణిజ్య ప్రయోజనాల కోసం చేపడుతున్నదని న్యాయవాది తెలిపారు.