సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): జోషీమఠ్ కుంగడానికి కారణాలు అన్వేషించే పనిలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. 9 మందితో కూడిన ఎన్జీఆర్ఐ బృందం 12 రోజుల పాటు మూడు కిలోమీటర్ల పరిధిలో అధ్యయనం చేయనున్నారు. భూమిలో వస్తున్న పగుళ్లు, శబ్ధ తరంగాల తీవ్రతను అంచనా వేస్తారు. భూమి అడుగున 30-90 మీటర్ల లోతులో భూ పొరల స్థితిగతులను గుర్తించనున్నారు. సిస్మోగ్రాఫిక్ విధానంలో భూకంపాల తీవ్రతను లెక్కించనున్నారు. కృత్రిమంగా భూ పొరల్లో తరంగాలను సృష్టించి చేసే ఈ పరీక్షల్లో… భవిష్యత్తులో వచ్చే భూకంప అవకాశాలు, వాటి తీవ్రతను తేలనుందని ఎన్జీఆర్ఐ సైంటిస్టులు చెబుతున్నారు.
అధ్యయనం తర్వాత సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించనున్నారు. మరోవైపు జోషీమఠ్‌లో పలు ఆర్మీ భవనాలకు సైతం పగుళ్లు ఏర్పడ్డాయని, దీంతో కొంత మంది ఆర్మీ సిబ్బందిని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ తెలిపారు.