హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది. శుక్రవారం 19జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
ఈ జిల్లాలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడంతో రాష్ట్రంలో ఈనెల మొదటివారంలోనే అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. జూన్ నెలలో 32 మి.మీ లోటు వర్షపాతం ఉండగా, ఈనెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో వానలు ఊపందుకున్నాయని పేర్కొన్నది. గురువారం సగటు సాధారణ వర్షపాతం 5.5 మి.మీ ఉండగా, 6.0మి.మీ నమోదైనట్టు తెలిపింది.
దీంతో రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకున్నట్టు వివరించింది. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, జగిత్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువగా, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 6.45 సెం.మీ అత్యధిక వర్షపాతం కురిసినట్టు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 5.37 సెం.మీ, సిరికొండలో 4.26 సెం.మీ, ఉట్నూర్లో 3.25 సెం.మీ, జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో 3.81 సెం.మీ, వడ్డేపల్లిలో 3.52 సెం.మీ, మానవపాడ్లో 3.30 సెం.మీ, జగిత్యాల జిల్లా బీర్పూర్లో 3.51 సెం.మీ, భదాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 3.08 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది.