బయ్యారం, మే 20: పెండ్లి జరిగిన రెండు రోజులకే వరుడు విద్యుత్‌షాక్‌తో మృతి చెందగా.. కండ్ల ఎదుటే భర్త మరణాన్ని చూసిన నవవధువు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బయ్యారం మండలం గౌరారం పంచాయతీ పరిధిలోని కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లావత్ బాలు, కౌసల్య దంపతుల చిన్న కుమారుడు నరేశ్ (25) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న విజయవాడలో పెండ్లి జరిగింది. మంగళవారం కోడిపుంజుల తండాలో రిసెప్షన్ ఉండడంతో బంధుమిత్రులంతా హాజరయ్యారు.
రిసెప్షన్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంట్లో నీటి కోసం వరుడు నరేశ్ బోరు మోటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకెళ్తండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. కండ్ల ముందే భర్త మరణాన్ని చూసిన వధువు కండ్లు తిరిగి పడిపోవడంతో మహబుబాబాద్లోని వైద్యశాలకు తరలించారు. కాళ్ల పారాణి ఆరకముందే వరుడు మృతి చెందడంతో పెండ్లింట తీవ్ర విషాదం నెలకొన్నది. విద్యుత్ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.