Ryhtu Discom | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కమ్‌లో ఆంధ్రా ఉద్యోగులే రాజ్యమేలబోతున్నారు. ఈ డిస్కమ్‌లో చేరేందుకు ఏపీకి చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. సీనియర్లు కావడంతో ఎలాగు వారికే మొదటి అవకాశం ఇస్తారు. దీంతో రైతు డిస్కమ్‌ను పూర్తిగా ఆంధ్రా ఉద్యోగులతో నింపేయడం ఖాయంగా కనిపిస్తున్నది. దీనిపై తెలంగాణ ఇంజినీర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే విద్యుత్తు సౌధతోపాటు తెలంగాణలోని విద్యుత్తు ప్లాంట్లల్లో కీలక స్థానాల్లో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు రైతు డిస్కమ్లోనూ కీలక స్థానాలను కొల్లగొట్టడాన్ని తెలంగాణ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.
రైతు డిస్కమ్ కార్యకలాపాల కోసం 2 వేల మంది ఉద్యోగులు అవసరమవుతారు. కానీ, ఆ డిస్కమ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. దీంతో రాష్ట్రంలోని నాలుగు విద్యుత్తు సంస్థల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులను రైతు డిస్కమ్‌లోకి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆప్షన్ల స్వీకరణ చేపట్టడంతో ఉత్తర డిస్కమ్ నుంచి 1,252 మంది, దక్షిణ డిస్కమ్ నుంచి 256 మంది, టీజీ జెన్కో నుంచి 446 మంది, టీజీ ట్రాన్స్‌కో నుంచి 166 మంది కలిపి ఇప్పటివరకు మొత్తం 2 వేల మంది అధికారులు, ఇంజినీర్లు, ఇతర సిబ్బంది ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో ఏపీకి చెందినవారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.
2వేల పోస్టులు రద్దు
రెండు రకాలుగా నష్టం
రైతు డిస్కమ్‌లో చేరినవారికి ఆటోమేటిక్‌గా ఒక ప్రమోషన్ ఇవ్వనున్నారు. అంటే ఒక డీఈ రైతు డిస్కమ్‌లో చేరిన వెంటనే సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా ఉద్యోగోన్నతి లభిస్తుంది. రైతు డిస్కమ్‌లో చేరేందుకు ఆంధ్రా ఉద్యోగులే అత్యధికంగా ఆప్షన్లు ఇవ్వడం, సీనియార్టీలోనూ వారే ముందుండటంతో ఉద్యోగోన్నతులన్నీ వారికే దక్కనున్నాయి. తెలంగాణ ఉద్యోగులు, ఇంజినీర్లు జూనియర్లు కావడంతో ఉద్యోగోన్నతులు దక్కే అవకాశాల్లేవు.
ఆప్షన్లు ఇచ్చినవారు రైతు డిస్కమ్‌లో చేరితే నాలుగు విద్యుత్తు సంస్థల్లో ఎస్ఈ, డీఈ, ఏఈడీ లాంటి పలు పోస్టులు రద్దవుతాయి. దీంతో ఆ 4 సంస్థల్లో పోస్టుల సంఖ్య తగ్గుతుంది. కింది స్థాయి క్యాడర్లో ఉన్నవారికి ఉద్యోగోన్నతులు దక్కవు. ఇది తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలిగిస్తుంది.