హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రకియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే నాన్ ట్రాన్స్పోర్ట్ మోటర్ సైకిళ్లు, కార్లకు మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని ఆర్టీవో కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. వాహనం కొనుగోలు చేసిన తర్వాతే అధికృత డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారని వెల్లడించింది.
అవసరమైన పత్రాలు డీలర్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారని వివరించింది. రవాణాశాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి, రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారని తెలిపింది. స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) యజమానికి పంపనున్నట్టు తెలిపింది. ఈ విధానంతో సమయం ఆదా అవడంతోపాటు వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానున్నట్టు పేర్కొన్నది. ఈ కొత్త విధానం కేవలం కార్లు, బైక్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. వాణిజ్య వాహనాలకు వర్తించదని వెల్లడించింది.