కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్లో వెలుగు చూసిన రూ.187 కోట్ల స్కామ్ లింకులు తెలంగాణలో బయటపడటం సంచలనంగా మారింది. ఈ స్కామ్‌లోని మొత్తం డబ్బులో రూ.45 కోట్లు హైదరాబాద్‌కు తరలిరావడం, అందునా ఒక్క ఆర్బీఎల్ బ్యాంకులోని 9 ఖాతాల్లోనే ఆ డబ్బు జమ కావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. ఈ స్కామ్ విషయమై గతంలో ఈడీ, సీబీఐ, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. అయితే, అనూహ్యంగా దానిపై ఏ ఏజెన్సీ ఏ ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. దీంతో కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కాపాడుతున్నదెవరన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
స్కామ్ జరిగిన మాట వాస్తవమే అయినప్పుడు, హైదరాబాద్‌కు నిధులు చేరాయన్నది కూడా నిజమే అయినప్పుడు ఆ డబ్బు ఎవరికి చేరింది? ఎందుకోసం ఈ డబ్బును వినియోగించారు? అనేది ఎందుకు విచారించడం లేదనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరోవైపు, కర్ణాటకలో ఈ స్కామ్ దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నిందితులను తప్పించి స్కామ్‌ను బయటపెట్టిన వ్యక్తినే కీలక నిందితుడిగా చేర్చడం కలకలం రేపుతున్నది.
Valmiki Corporation Scam | హైదరాబాద్, ఆగస్టు 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కర్ణాటకలో జరిగిన వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‌లో తెలంగాణ లింకులపై విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? కార్పొరేషన్ నుంచి దారిమళ్లించిన రూ.45 కోట్లు హైదరాబాద్‌కు చేరాయని విచారణ సంస్థలు తేల్చినా లోతైన విచారణ ఎందుకు చేయడం లేదు? మొదట్లో సోదాలతో హడావుడి చేసిన దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఎందుకు హైదరాబాద్‌వైపే చూడటం లేదు? ఊరూపేరు లేని కంపెనీలకు డబ్బులు జమ కావడం, అందునా డబ్బులు జమ అయిన ఖాతాలన్నీ ఒకే బ్యాంకుకు చెందినవి కావడం అనుమానాలను బలపరుస్తున్నా దర్యాప్తు సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదు?.. వాల్మీకి స్కామ్ దర్యాప్తుపై ఎదురవుతున్న ప్రశ్నలివి.
లోక్‌సభ ఎన్నికల ముందు ఈ డబ్బులు తెలంగాణకు చేరాయని, ఎన్నికల్లో వీటిని వినియోగించినట్టు అనుమానాలు ఉన్నప్పటికీ ఈ దిశగా విచారణ చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అసలు, ఈ స్కామ్‌తో సంబంధమున్న తెలంగాణకు చెందిన వారిని ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారనేది అంతుచిక్కని ప్రశ్న.
వాల్మీకి కార్పొరేషన్ నుంచి దారిమళ్లిన మొత్తం రూ.187 కోట్లలో తెలుగు రాష్ర్టాలకు రూ.90 కోట్లు చేరినట్టు కర్ణాటక సిట్ అంతర్గత నివేదికలో వెల్లడించింది. ఇందులో రూ.44.6 కోట్లు హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది కంపెనీల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్టు వివరించింది. సిట్ నివేదిక ప్రకారం.. వాల్మీకి కార్పొరేషన్ ఎండీ, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న జేజీ పద్మనాభ్, సస్పెండైన అకౌంట్స్ అధికారి పరశురామ్ బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్డు బ్రాంచీలో మార్చి 30, 2024న రూ.50 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ టర్మ్ డిపాజిట్‌పై అదే రోజు రూ. 45 కోట్ల మేర రుణానికి దరఖాస్తు చేశారు. ఇందులో నుంచి అదేరోజు హైదరాబాద్‌లోని ఆర్బీఎల్ బ్యాంకుకే చెందిన 9 బ్యాంకు ఖాతాలకు రూ.44.6 కోట్లను బదిలీ చేశారు.
డబ్బు జమ అయిన 9 ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాలు నకిలీవని, కేవలం స్కామ్ డబ్బులు తరలించడానికే వీటిని తాత్కాలికంగా వినియోగించుకొన్నట్టు ఈడీ తెలిపింది. ప్రస్తుతం ఈ అకౌంట్లు క్రియాశీలంగా లేవని వెల్లడించింది. వాల్మీకి కార్పొరేషన్లో నిధులు పక్కదారి పట్టాయని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే పేర్కొనడం గమనార్హం.
వాల్మీకి కార్పొరేషన్ నుంచి హైదరాబాద్‌లోని తొమ్మిది ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాలకు రూ.44.6 కోట్లు బదిలీ కాగా ఏపీలోని మరో 9 బ్యాంకు ఖాతాలకు మరో రూ.45 కోట్లు బదిలీ అయినట్టు ఈడీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చేరిన రూ.44.6 కోట్ల నగదుతో లోక్‌సభ ఎన్నికల ముందు పెద్దయెత్తున మద్యం, ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈడీ, సీబీఐ, సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఆ సోదాల్లో ఏం లభించాయన్న విషయంపై మాత్రం కేంద్ర ఏజెన్సీలు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కామ్‌కు పాల్పడిందని, స్కామ్‌లోని రూ.44.6 కోట్లు హైదరాబాద్‌కు చేరడాన్ని చూస్తే, ఇక్కడి కాంగ్రెస్‌కు కూడా ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్టు అర్థమవుతున్నదని పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ స్కామ్‌ను విచారిస్తున్న కేంద్రప్రభుత్వ ఏజెన్సీ ఈడీ వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉన్నది. దీంతో కేంద్రంలోని బీజేపీ, ఇరు రాష్ర్టాల్లోని కాంగ్రెస్ పెద్దలు ఈ స్కామ్‌లోని అసలు నిజాలు బయటకు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్ లోగుట్టు కాంగ్రెస్, బీజేపీ నేతలకే తెలుసునని సోషల్‌మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం కోసమే ‘వాల్మీకి కార్పొరేషన్’ నిధులను అక్రమంగా వాడుకొన్నట్టు ఈడీ, సిట్ విచారణలో ప్రాథమికంగా తేలింది. అయితే, నిధుల బదిలీని వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్ పీ చంద్రశేఖరన్ తొలుత వ్యతిరేకించడంతో ఆయన్ని తప్పించినట్టు సమాచారం. దీంతో ఆయన గత మే 26న ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే, తన మరణ వాంగ్మూలంలో స్కామ్‌కు సంబంధించిన కీలక వివరాలను బయటపెట్టారు. దీంతో విచారణ జరిపిన ఈడీ.. కుంభకోణంలో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బసనగౌడ దద్దల్, మరో ఇద్దరు బ్యాంకు అధికారులు సహా మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది.
స్కామ్‌ను బయటపెట్టిన తన భర్తనే కీలక నిందితుడిగా చిత్రీకరించేందుకు కుట్రలు మొదలయ్యాయని సూపరింటెండెంట్ పీ చంద్రశేఖరన్ సతీమణి కవిత ఆరోపించారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి.. కవితను సంప్రదించినప్పుడు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ‘అసలు ఈ వాల్మీకి స్కామ్‌ను మొదటి నుంచి వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి నా భర్త పీ చంద్రశేఖరన్. అయితే, ఈ స్కామ్‌కు సహకరించాలని అందరూ ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో అది ఇష్టంలేని ఆయన గత మేలో ఆత్మహత్య చేసుకొన్నారు. ప్రజాధనం వృథాగా పోవొద్దని సూసైడ్ నోట్లో ప్రధాన నిందితుల పేర్లతో సహా స్కామ్‌కు సంబంధించిన అన్ని వివరాలు పేర్కొన్నారు. అయితే, శివమొగ్గ జిల్లా కోర్టుకు గురువారం సిట్ సమర్పించిన రెండో చార్జిషీట్లో అసలు నిందితుల పేర్లు కనిపించలేదు.
నా భర్తను కీలక నిందితుడిగా సిట్ తాజాగా చేర్చింది. ఆయన డబ్బు తీసుకొన్నట్టు అబద్ధపు ఆరోపణలు చేసింది. ఇది ఎంత అన్యాయం? స్కామ్‌ను బయటపెట్టిన వ్యక్తే.. ఎక్కడైనా ఆ స్కామ్‌కు పాల్పడుతాడా? దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం. ఈ స్కామ్ వెనుకున్న అసలు నిజాలు బయటకు రావాలంటే ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలి’ అని నమస్తే తెలంగాణ ప్రతినిధితో కవిత అన్నారు. కేసుకు సంబంధించి తనను కూడా విచారించాల్సిందిగా ఈడీ అధికారినంటూ ఒకరు తనకు ఫోన్ చేసినట్టు పేర్కొన్న కవిత.. కేసు తేలేవరకూ శివమొగ్గ వదిలి వెళ్లొద్దని తనతో చెప్పినట్టు వాపోయారు.
‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన రూ. 187 కోట్లు పక్కదారిపట్టాయి. దీన్నే ‘వాల్మీకి కార్పొరేషన్’ స్కామ్‌గా పిలుస్తున్నారు. నిజానికి ఈ స్కామ్ జరిగినట్టు ఎవరికీ తెలియదు. అయితే, చంద్రశేఖరన్ గత మే 26న ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. వాల్మీకి కార్పొరేషన్ నుంచి చట్ట విరుద్ధంగా పలు బ్యాంకు ఖాతాలకు రూ.187 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని చంద్రశేఖరన్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. స్కామ్‌లో భాగమైన నిందితుల పేర్లనూ లేఖలో ప్రస్తావించారు. దీనిపై సర్వత్రా ఒత్తిడి పెరుగడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం.. ఈ కుంభకోణంపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది.
పభుత్వం ఏర్పాటు చేసిన సిట్ శివమొగ్గ జిల్లా కోర్టుకు గురువారం సమర్పించిన రెండో చార్జిషీట్ నివేదికలో అసలు నిందితుల పేర్లను తప్పించడం కలకలం రేపుతున్నది. వాల్మీకి కుంభకోణంలో ప్రధాన నిందితులైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బసనగౌడ దద్దల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) చీఫ్ మేనేజర్ సుచిస్మితా రావల్ పేర్లు సిట్ రెండో చార్జిషీట్లో కనిపించలేదు. స్కామ్‌ను బయటపెట్టిన చంద్రశేఖరన్‌ను నిందితుడిగా సిట్ కొత్తగా చేర్చింది. దీంతో ఈ విచారణ పక్కదారి పడుతున్నదని పలువురు విమర్శిస్తున్నారు.
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చినట్టే, తెలంగాణ సీఎం రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చంటూ కర్ణాటక పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్కిహోళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాల్మీకి సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న జార్కిహోళి.. తమ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదంటూ ఆ వర్గం ప్రజలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై ఆయనపై పలు విధాలుగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో పెరుగుతున్న అసమ్మతిని చల్లార్చడానికి ఆయన చేయని ప్రయత్నంలేదు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చని జార్కిహోళి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాల్మీకి స్కామ్’ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో జరుగడం, అక్కడి డబ్బు తెలంగాణకు చేరడం, తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, నోటీసుల గురించి ‘వాల్మీకి’ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత జార్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తే.. ఈ స్కామ్‌లోనే సీఎంకు నోటీసులు వస్తాయా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.