హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలు మారబోతున్నాయి. 1 నుంచి 10 తరగతుల వరకు కొత్త సిలబస్ సిద్ధంకానున్నది. ఇప్పుడున్న సిలబస్ స్థానంలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మన పుస్తకాలు సమూలంగా మారిపోతాయి. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సిలబస్ మార్పుపైనా చర్చించారు.
గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని, సాంఘికశాస్త్రంలో 70% సీబీఎస్ఈ, 30% స్టేట్ సిలబస్ చేర్చాలని అధికారులు ప్రతిపాదించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం కే కేశవరావు నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసులు సర్కార్‌కు చేరిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని కొందరు ఐఏఎస్‌లు సమావేశంలో అభిప్రాయపడ్డారు. మొత్తంగా 2027-28 విద్యా సంవత్సరంలో కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరాక సిలబస్ మార్పు తెరపైకి వచ్చింది. దేనిని ప్రమాణికంగా తీసుకోవాలన్న అంశంపై స్పష్టత కొరవడింది. ఎన్ఈపీ అమలు నేపథ్యంలోఎన్సీఎఫ్- 2023ను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగానే కొత్త కరిక్యులం రూపొందించాలని అధికారులు భావించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన జరుగుతున్న తరుణంలోనే ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలన్న చర్చ ప్రారంభమైంది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలనే తీసుకుంటే సరిపోయేది కదా.. మరీ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకున్న ప్రశ్నలొస్తున్నాయి.