Telangana Cabinet | కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌కు మరో తలనొప్పి తెచ్చింది. మంత్రి పదవి దక్కిన వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. పదవి ఆశించి భంగపడ్డ నేతలు అలకపూనారు. దీంతో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్ సిద్ధమైంది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌లు తమకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మొదట్నుంచి వచ్చిన ఊహాగానాల్లోనూ వీరి పేర్లే ప్రముఖంగా వినిపించాయి. కానీ చివరకు అనూహ్యంగా కాంగ్రెస్ అధిష్టానం వారికి మొండి చేయి చూపింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్ సిద్ధమైంది.
మంత్రివర్గంలో తనకు స్థానం లభించకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన నివాసానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్ వెళ్లారు. ఆయనతో సంప్రదింపులు జరిపారు. సుదర్శన్ రెడ్డితో చర్చల అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుతో మాట్లాడేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే వారిద్దరూ అందుబాటులో లేకుండాపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మల్రెడ్డి రంగారెడ్డి ఇవాళ సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టనున్నట్లు తెలిసింది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.