Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ విద్యా కమిషన్’ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విధివిధానాలను ఖరారు చేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం జీవో 27ను విడుదల చేశారు.
ఈ కమిటీకి ఒక చైర్పర్సన్, ముగ్గురు సభ్యులను నియమిస్తారు. రెండేండ్ల కాల పరిమితితో ఈ కమిషన్ పనిచేయనున్నది. హెచ్‌వోడీ స్థాయి ఐఏఎస్ అధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. యూనివర్సిటీల్లో పబ్లికేషన్ల సంఖ్య తగ్గడం, పరిశోధన కార్యకలాపాలు కుంటుపడుతుండటంతో వర్తమాన మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర మార్పులకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నది. ఆ బాధ్యతలను విద్యాకమిషన్‌కు అప్పగించింది. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ కమిషన్ ప్రభుత్వానికి సూచనలు చేయనున్నది.