హైదరాబాద్, ఆగస్టు2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీని తీసుకువస్తామని, దానికోసం పలు రాష్ర్టాల పాలసీలను అధ్యయనం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. 2024 పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఉద్యోగాలు ఇవ్వటంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్లో రూ.321కోట్లు కేటాయించిందని తెలిపారు. హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల పాలసీలను అధ్యయనం చేసి మంచి పాలసీని రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని వెల్లడించారు. మండల కేంద్రాల్లో భూములు అందుబాటులో ఉంటే స్టేడియం నిర్మించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, బ్యాగరికంచెలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, వారూ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కొద్దిరోజుల్లోనే అందుకు భూమిని కేటాయిస్తామని వివరించారు.
క్రీడల విషయంలో నిధుల కేటాయింపుతోపాటు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని, ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని అన్నారు. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయమని, వాటన్నింటినీ అప్‌గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరమున్నదని, ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నదని, అందుకు అందరూ మద్దతివ్వాలని కోరారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో చాటుతున్న క్రీడాకారులను సముచితంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, అందుకే క్రికెటర్ సిరాజ్‌కు, బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా ఉద్యోగం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ సవరణ బిల్లుకు పార్టీలకతీతంగా సభ్యులందరూ మద్దతు తెలిపారు.
నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్‌కు ప్రభుత్వ సాయాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామన్న సీఎం వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నామని, ఆ పాలసీ తీసుకొచ్చినప్పుడు తమ వంతుగా సూచనలు కూడా ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందని, వీటిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.