Election Code | హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలుకై వచ్చే ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్క్రీనింగ్ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, ఆయా ప్రతిపాదనలకు సంబంధించి సంబంధిత కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని వివరించారు. ఎంసీసీ అమలు ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించి ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదిస్తుందని జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియంత్రణ, అమలుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించడానికి సంబంధిత శాఖల వారీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సాధారణ పరిపాలన విభాగానికి చెందిన కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆ ఉత్తర్వులలో పేరొన్నారు. ఈ స్క్రీనింగ్ కమిటీ ఎలక్షన్ కమిషన్కు ప్రతిపాదించే అంశాలపై కమిటీ సభ్యులు పరీశిలించి తగు నిర్ణయాల కోసం ఎలక్షన్ కమిషన్కు ప్రతిపాదిస్తారు.