హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు నుంచి కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్నది. అదే ‘ఈకేవైసీ రూల్’. ఈ నిబంధన ప్రకారం.. ఉపాధి కూలీలు తమ పని ప్రదేశంలో ప్రతి రోజూ ఉదయం ఓసారి, సాయంత్రం 4 గంటల తర్వాత మరోసారి ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నకిలీ హాజరు, తప్పుడు ఫొటోల అప్లోడ్ లాంటి మోసాలకు తావులేకుండా వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత తీసుకురావడమే ఈ కొత్త రూల్ ఉద్దేశమని సర్కారు చెప్తున్నది. కానీ, క్షేత్రస్థాయిలో ఈ నిబంధనను అమలు చేయడం కష్టమని ఫీల్డ్ అసిస్టెంట్లు చెప్తున్నారు.
కొలతల ప్రకారం పనిపూర్తి చేసుకొని వెళ్లే తమను ఫొటోల కోసం నిలువనీడ లేని ప్రాంతాల్లో సాయంత్రం వరకు ఉండాలనడం ఎంతవరకు సమంజసమని కూలీలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53.006 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. వాటిలో యాక్టివ్ కార్డులు 32.97 లక్షలు. రాష్ట్రంలోని మొత్తం 110.55 లక్షల మంది ఉపాధి కూలీల్లో యాక్టివ్గా 55.88 లక్షల మంది పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద నిరుడు రూ.12 కోట్ల లేబర్ బడ్జెట్ను ఆమోదించగా.. ఈ సంత్సరంలో రూ.6.5 కోట్లు మాత్రమే ఆమోదించారు.
ఉపాధి కూలీలు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ (ఎన్ఎంఎంఎస్)లో నకిలీ ఫొటోలు అప్లోడ్ చేసి వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో ఒకరికి బదులు మరొకరు పనులకు వెళ్లి వేతనాలు పొందుతున్నట్టు సామాజిక తనిఖీల్లో తేలింది. ప్రజాప్రతినిధుల బంధువులు, ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబసభ్యులు కూడా మస్టర్లలో తప్పుడు హాజరు నమోదు చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ యాప్ను తీసుకొచ్చినప్పటికీ దానిని కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలు ప్రభుత్వం దృష్టికి రావడంతో త్వరలో ఈకేవైసీ విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. పని ప్రదేశంలో ప్రతి రోజూ ఉదయం ఓసారి, సాయంత్రం మరోసారి కూలీల ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు స్పష్టం చేసింది. ఈ రెండు ఫొటోల్లోని వ్యక్తులు ఒకేలా ఉంటేనే వేతనాలు మంజూరు చేస్తారు.
ఉపాధి పనులు గ్రామాలకు దూరంగా జరుగుతుంటాయి. ఒక పని గ్రామ చెరువు దగ్గర జరిగితే, మరో పని 3-4 కిలోమీటర్ల దూరంలో పంట కాల్వ వద్ద జరుగుతుంది. ఓచోట 10 మంది, మరో చోట 15 మంది కూలీలు పనిచేస్తుంటారు. వారి ఫొటోలను ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కరే తీయాల్సి ఉంటుంది. చిన్న గ్రామాల్లో 100-150 మంది, మేజర్ గ్రామపంచాయతీల్లో 1,000-1,200 మంది కూలీలు ఉంటారు. పనుల కొలతలను బట్టి వారికి కూలీ చెల్లిస్తుంటారు. నిమ్మ మొక్కల కోసం 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతైన గుంతలు తీస్తే ఒక్కో గుంతకు రూ.70 చొప్పున చెల్లిస్తారు. అలా ఇద్దరు కలిసి రోజుకు 10 గుంతలు తీస్తే వారికి కూలీ గిట్టుబాటు అవుతుంది. సరిగ్గా పనిచేస్తే 3 గంటల్లో ఈ పని పూర్తవుతుంది.
ఉదయం 9 గంటలకు తొలి ఫొటో తీస్తే.. రెండో ఫొటో మధ్యాహ్నం 1 గంట తర్వాతే తీయాలి. నిర్దేశించిన పని ఆ సమయంలోఫేస్ ముగిసినా ఫొటో తీయడం, యాప్లో అప్లోడ్ చేయడం వీలుపడదు. అలా రెండు ఫొటోలు తీస్తేనే హాజరు నమోదై కూలీలకు వేతనం వస్తుంది. లేదంటే రాదు. నిలువనీడ లేని పని ప్రదేశాల్లో ఫొటోల కోసం గంటల తరబడి ఎలా నిరీక్షించాలని కూలీలు ప్రశ్నిస్తున్నారు. కొలతల ప్రకారం చేసిన పనికి కూలి ఇవ్వడానికి ఇన్ని తిరసకాలు ఏమిటని, ఇదంతా తమకు ఉపాధి దక్కకుండా చేసే కుట్ర అని వాపోతున్నారు. వేసవిలో ఉదయం 7 గంటకే పనులు మొదలు పెడతారు.
మొదట ఫొటో దిగిన తర్వాత కొంత మంది రైతు కూలీలు తమకు నిర్దేశించిన పనిని త్వరగా పూర్తిచేసుకొని వ్యవసాయ పనులకు వెళ్లిపోతుంటారు. ఇకపై అలా వెళ్లడం వీలుకాదు. పని పూర్తయినా 4 గంటల తర్వాత రెండో ఫొటో తీసేవరకు అక్కడే ఉండాల్సిందే. ఉదాహరణకు ఓచోట 10 మంది పని చేస్తున్నప్పుడు మొదటి ఫొటోలో ఎంత మంది ఉంటే రెండో ఫొటోలోనూ అంత మంది ఉండాల్సిందే. తక్కువైనా, ఎక్కువైనా యాప్ ఫొటోను తీసుకోదు. దుస్తులు మారినా అంగీకరించదు. కొత్త ఈకేవైసీలో ఇలాంటి నిబంధనలు ఎన్నో ఉన్నాయని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నేతలు తెలిపారు.