హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో గత ప్రభుత్వం (బీఆర్ఎస్)తో తమకు సిద్ధాంతపరమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి కేసీఆర్ అనుసరించిన ప్రగతిశీలమైన విధానాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు చెప్పారు. సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే ఇంకా మెరుగైన విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. గడిచిన 10-15 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లనే తెలంగాణ దేశంలోనే హయ్యెస్టు పెర్ఫార్మర్గా నిలిచిందని చెప్పారు. తెలంగాణ వార్షిక వృద్ధి రేటు 11 శాతానికి పెరిగిందని, తలసరి ఆదాయం 19.3 శాతం పెరిగిందని అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పరుచుకున్న హైటెక్ సిటీతో అనేక సాప్ట్వేర్ కంపెనీలు వచ్చాయని, దీంతో చాలామందికి ఉపాధి కల్పన పెరిగిందని తెలిపారు.
ఫిబ్రవరి 1 నుంచి ‘బిల్డ్ నౌ’
రాష్ట్రంలో భవనాల నిర్మాణాలు, లే అవుట్ల అనుమతుల కోసం ‘బిల్డ్ నౌ’ పేరిట ప్రభు త్వం నూతన ఆన్లైన్ విధానంలో ఏకీకృత పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. సచివాలయంలో మంగళవారం అధికారులతో ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణాలు, లేఅవుట్ల కోసం దరఖాస్తులు, స్టేటస్ ట్రాకింగ్, ఫీజు చెల్లింపులు తదితర వాటన్నింటికీ కలిపి ఒకే వేదికను ఏర్పాటు చేసేందుకు ఈ ఏకీకృత పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. దరఖాస్తు దాఖలు సమయాన్ని తగ్గించామని, నాన్-హై-రైజ్ భవన అనుమతులకు 21 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించామని తెలిపారు. పది రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కొత్త విధానంపై ఆర్కిటెక్టులు, ప్రభుత్వ అధికారులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు.