హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లను అందజేస్తామని పురపాలన, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఇప్పటివరకు పింఛన్లు రానివారికి ఏప్రిల్ నుంచి ఇవ్వనున్నామని పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బహిరంగసభలో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి, కొత్తవి మంజూరు చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ సర్కారు పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిందని.. గతంలో ఏడాదికి రూ.800 కోట్లు ఖర్చుచేస్తే కేసీఆర్ సర్కారు వచ్చాక ఏడాదికి ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు. గతంలో లబ్ధిదారులు 29 లక్షలమంది ఉండేవారని.. అదనంగా మరో 11 లక్షలమందితో మొత్తం 40 లక్షల మందికి పింఛన్ అందజేస్తున్నామని చెప్పారు.
కడుపునిండా అభివృద్ధి.. సంక్షేమం
రాష్ట్రంలో కడుపునిండా అభివృద్ధి- సంక్షేమం అమలవుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతంలో మున్సిపాలిటీలకు కోటి, రెండు కోట్ల నిధులిస్తే చాలా ఎక్కువని.. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోని మూడు మున్సిపాలిటీలకు రూ.221 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అన్నది సామెత అని, ఇల్లూ నేనే కట్టిస్తా.. పెండ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా 10 లక్షల మంది ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేసిన మేనమేమ కేసీఆర్ అని ప్రశంసించారు. ఈ రెండింటి ద్వారా రూ.8,421 కోట్లను కట్నం రూపంలో ఆడబిడ్డలకు అందజేశామన్నారు. కేసీఆర్ కిట్‌తో మాతాశిశు మరణాలు తగ్గాయని తెలిపారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా తల్లీబిడ్డకు పౌష్టికాహారం, అంగన్వాడీల్లో బాలామృతం, పేదింటి బిడ్డలకు కడుపునిండా సన్నబియ్య ం బువ్వపెడుతున్న ప్రభుత్వం తమదని గుర్తుచేశారు.
కేసీఆర్ వల్లే సాధ్యం
మన ఊరు- మన బడి పథకం ద్వారా రూ.7,289 కోట్లతో 26 వేల బడుల రూపురేఖలను అద్భుతంగా మార్చనున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలు లేకున్నా సంక్షేమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా 16 వేల కోట్లు, ఓవర్సీస్ విద్యానిధి ద్వారా ఒక్కొక్కరికి రూ.20 లక్షలు ఇస్తున్నామన్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామా ల రూపురేఖలను మార్చామని, మిషన్ భగీరథతో మంచినీళ్లు అందిస్తున్నామని, టీఆర్ఎస్ హయాంలోనే కోతల్లేని విద్యుత్తు సాధ్యమైందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన సంసద్ ఆదర్శ్ గ్రామయోజనలో దేశంలో ఉత్తమంగా నిలిచిన మొదటి 10 పల్లెల్లో 7 తెలంగాణకు చెందినవే ఉన్నాయన్నారు. 75 ఏండ్లలో రైతుబంధు పథకాన్ని ఏ ప్రధాని కానీ, సీఎం గానీ ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. రైతుబంధుతో 62 లక్షల కుటుంబాల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు జమచేశామన్నారు. ఇవన్నీ కేసీఆర్ వంటి దమ్మున్న నాయకుడి వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు.