Land Cruisers | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రులకు కొత్తగా ల్యాండ్ క్రూయిజర్ కార్లను ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ కేటాయించింది. ఒక్కొక్క మంత్రికి ఒక్కో కారు చొప్పున కేటాయించినట్టుగా తెలిసింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం నూతనంగా అత్యాధునిక వ్యవస్థ కలిగిలిన బుల్లెట్ ప్రూఫ్ కార్లను సీఎం సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వింగ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం నానా రభస చేసింది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని దుమ్మెత్తిపోశారు.
నాడు వ్యతిరేకించిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వాహనాల కొనుగోలుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిసెంబర్ 28, 2023న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను కొత్త బండ్లు కొననని, కొత్తగా ఖర్చుపెట్టేందుకు సుముఖత వ్యక్తం చేయనని చెప్పారు. 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని మాజీ ముఖ్యమంత్రి దాచిపెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఒక్కొక్క బండికి సుమారు రూ.3 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అవసరమా? అంటూ గత ప్రభుత్వంపై నెపం వేశారు.
ఇటీవల ఓ మంత్రి కొత్త ల్యాండ్ క్రూయిజర్ వాహనానికి పూజలు నిర్వహించడంతో.. సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్లో మాటలను ఊటంకిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు తిరగాల్సిన వాహనాలను సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ విభాగం పరిశీలిస్తుంటుందని, వాహనాల కెపాసిటీ, బుల్లెట్ ప్రూఫ్ వంటివి రహస్యంగానే ఉంచుతారనే విషయం తెలియదా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాంటి విషయాన్ని సైతం సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయాలకు వాడుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భద్రత కోసమే..
మంత్రుల భద్రత కోసం అత్యాధునిక వాహనాలు కావాలని ఇంటెలిజెన్స్ విభాగం చేసిన సూచనల మేరకు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కే.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. ఒక ల్యాండ్ క్రూయిజర్ కార్కు బుల్లెట్ ప్రూఫ్ చేయడం వల్ల మొత్తం రూ.3 కోట్ల ఖర్చు అవుతుంది. శత్రువులు దాడి చేసినా, బ్లాస్ట్‌లకు పాల్పడినా.. ఈ బుల్లెట్ ప్రూఫ్ సమర్థంగా రక్షిస్తుంది. ప్రజాప్రతినిధుల రక్షణ కోసం వీటిని సీఎం సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ విభాగం, ప్రొటోకాల్ విభాగం వీటిని వినియోగించాలని సూచిస్తుంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటెలిజెన్స్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి, నిధులు విడుదల చేశారు.