హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టులో కొత్తగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరి పేర్లను ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫారసులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదించారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ 24న కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో న్యాయవాదుల కోటా నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్ కుమార్, జువ్వాడి శ్రీదేవి (కుచ్చాడి శ్రీదేవి), నచ్చరాజు శ్రావణ్ కుమార్ వెంకట్.. న్యాయాధికారుల కోటా నుంచి జీ అనుపమ చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, అనుగు సంతోష్‌రెడ్డి, డాక్టర్ దేవరాజు నాగార్జున న్యాయమూర్తులవుతారు. వీరి ప్రమాణ స్వీకారంతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి, మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10కి (దాదాపు 33 శాతానికి) చేరుతుంది. మరో 13 పోస్టులు ఖాళీగా ఉంటాయి.