OTT | ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై భారీ విజయాలను అందుకున్న రెండు సినిమాలు ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’, అలాగే యువ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాలు ఇవాళ్టి నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సంక్రాంతి సీజన్లో కుటుంబ ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన దక్కించుకున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. దర్శకుడు అనీల్ రావిపూడి తనదైన కామెడీ టైమింగ్, ఎమోషనల్ టచ్‌తో తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
చిరంజీవి – నయనతార జోడీకి మరోసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కుటుంబ బంధాలు, వినోదం, సందేశం కలగలిపిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 (ZEE5) సొంతం చేసుకుని స్ట్రీమింగ్ ప్రారంభించింది. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రావడం విశేషం. దీంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు మరింత వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు యువ ప్రేక్షకుల ఫేవరెట్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ కూడా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా నిలిచింది.
నవీన్ పోలిశెట్టి తన కామిక్ టైమింగ్‌తో మరోసారి నవ్వులు పూయించగా, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన అందం, నటనతో ఆకట్టుకుంది. లైట్ హార్ట్డ్ స్టోరీ, ఫ్రెష్ స్క్రీన్‌ప్లే, వినోదభరితమైన సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుని ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయినవారు లేదా మళ్లీ చూడాలనుకునే సినీ అభిమానులకు ఇది మంచి అవకాశం. ఒకవైపు మెగాస్టార్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్టైనర్, మరోవైపు నవీన్ పోలిశెట్టి నవ్వుల జల్లు కురిపించే యూత్‌ఫుల్ మూవీ. ఇలా రెండు భిన్నమైన జానర్లకు చెందిన సూపర్ హిట్ చిత్రాలు ఒకేసారి ఓటిటిలోకి రావడం సినీ ప్రియులకు డబుల్ ట్రీట్‌గా మారింది. ఈ వీకెండ్ కుటుంబంతో కలిసి ఇంట్లోనే మంచి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ రెండు సినిమాలు బెస్ట్ ఆప్షన్‌గా నిలవనున్నాయి.