హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): పనులు జానెడు.. పనివారు బోలెడు అన్న చందంగా తయారైంది తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) పరిస్థితి. సంస్థలో ఏ ఒక్క అధికారికీ చేతినిండా పనిలేకపోయినా, పోస్టులను సృష్టించి మరీ ఫారిన్ సర్వీసుల కింద అధికారులను భర్తీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరిశ్రమలకు అవసరమైన విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి దరఖాస్తు చేసుకున్నవారికి నిర్ణీత ధరకు భూములు కేటాయించడం టీజీఐఐసీ విధి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి పరిశ్రమలకు భూముల కేటాయింపు, కొత్త ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి పనులు నిలిచిపోగా, ఇతర శాఖల అధికారులకు టీజీఐఐసీ పునరావాస కేంద్రంగా మారిపోయింది.
గత బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శికితోడు టీజీఐఐసీకి ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఒక ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉండేవారు. ఇప్పుడు మరో ముగ్గురు ఉన్నతాధికారులు వచ్చిచేరారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శికి తోడు కార్యదర్శిగా ఒక అఖిల భారత సర్వీసు అధికారిని నియమించారు. అంతేకాదు, టీజీఐఐసీ ఎండీకి కింద సీఈఓ ఉండగానే ఇద్దరు ఎగ్జిక్యూటివ్ అధికారుల(ఈఓ)ను నియమించారు. ఇందులో ఒకరు ఆడిట్ శాఖ నుంచి, మరొకరు ఎక్సైజ్ శాఖ నుంచి ఫారిన్ సర్వీసుల కింద వచ్చారు. టీజీఐఐసీ ఎండీగా గతంలో ఐఏఎస్ అధికారి కొనసాగగా, ఇప్పుడు సెంట్రల్ సర్వీసులకు చెందిన అధికారిని కొనసాగిస్తున్నారు.
పరిశ్రమల అభివృద్ధికి మౌలిక సదుపాయాలను కల్పించే టీజీఐఐసీకి చీఫ్ ఇంజినీర్తోపాటు ఇంజినీరింగ్ విభాగం, ఆయా రంగాలకు డైరెక్టర్లు, జిల్లాలవారీగా జోనల్ కమిషనర్లు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, భూముల కేటాయింపునకు జిల్లాలవారీగా జోనల్ అధికారులు, ప్రధాన కారాలయంలో జీఎంలు ఉన్నప్పటికీ వారిపై కొత్తగా ఈడీలను నియమించడం గమనార్హం.