హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : గ్యాస్ సిలిండర్ల దిగుమతి సరిగా లేకపోవడంతో కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తే సంక్షోభం మరింత పెరుగుతుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కొత్త గ్యాస్ కనెక్షన్ల నిలిపివేతపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయని సర్కార్, అంతర్గతంగా చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగానే గ్యాస్ ఏజెన్సీల వెబ్సైట్లో కొత్త కనెక్షన్ల దరఖాస్తు ఆప్షన్ను క్లోజ్ చేసినట్టు డీలర్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తున్నది. కొత్త కనెక్షన్ కోసం ఏజెన్సీలకు వెళ్లిన ప్రజలకు చుక్కెదురవుతున్నది. దరఖాస్తులు తీసుకోవడంలేదని, కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదని డీలర్లు తేల్చిచెప్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.3 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రోజూ సగటున 60 లక్షల బుకింగ్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో హొర్ముజ్ జలసంధి మూతపడి గ్యాస్ దిగుమతికి ఆటంకం కలుగడంతో దేశ వ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్న పరిస్థితులున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక సిలిండర్ ఉన్నవాళ్లు, ఇతర మార్గాల ద్వారా గ్యాస్ వినియోగించుకుంటున్న వారంతా కొత్త కనెక్షన్లు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కొత్త కనెక్షన్లు జారీచేస్తే మరింత గందరగోళం ఏర్పడుతుందని, ఏజెన్సీల ముందు భారీ క్యూలు తప్పవన్న ఆందోళనతో కొత్త కనెక్షన్ల మంజూరు నిలిపివేసినట్టు తెలిసింది.
మేడ్చల్ జిల్లా అల్వాల్ పరిధిలో ఓ వినియోగదారుడు మార్చి 10న గ్యాస్ సిలిండర్ బుక్ చేశారు. నెల దాటినా ఇప్పటికీ గ్యాస్ డెలివరీ కాలేదు. గ్యాస్ డెలివరీ కాకపోయినా సబ్సిడీ మాత్రం జమైంది. దీనిపై సదరు వినియోగదారుడు గ్యాస్ ఏజెన్సీకి ఎన్నిమార్లు ఫోన్ చేసినా స్పందనలేదు. దీనిపై సదరు వినియోగదారుడు మేడ్చల్ జిల్లా సివిల్ సప్లయిస్ ఆధికారికి ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యపు సమాధానమే ఎదురైంది. ఇలా ఇప్పటికీ 10-12 లక్షల గ్యాస్ బుకింగ్ డెలివరీలు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది.
రాష్ట్ర స్థాయిలో సివిల్ సప్లయిస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా అక్రమ దందాకు తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు బుక్ చేసుకున్న సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల సివిల్ సప్లయిస్ అధికారుల దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.1.5 కోట్ల విలువైన 5,079 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేయడం అక్రమ దందాకు సాక్ష్యంగా నిలిచింది.
వినియోగదారులకు వంటగ్యాస్ కష్టాలు తీరడంలేదు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు శనివారం వినియోగదారులు భారీగా తరలివచ్చారు. ఖాళీ సిలిండర్లను క్యూలో ఉంచి బారులుతీరారు. బుక్ చేసుకున్న వినియోగదారులు సాయంత్రం 6 గంటల వరకు ఎదురుచూసిన తర్వాత సిలిండర్లు తీసుకెళ్లారు. 342 సిలిండర్లు రాగా.. స్టాక్ ఉన్నంత వరకు అందజేశారు.
-మానవపాడు