Excise Police Stations | రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ప్రారంభం వాయిదా పడింది. ఏప్రిల్ 1వ తేదీకి బదులు 3వ తేదీన ప్రారంభించాలని ఎక్సైజ్ అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుధవారం నాడు హైదరాబాద్‌లో 13, వరంగల్ అర్బన్‌లో ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్లో 13, వరంగల్ రూరల్‌లో ఒక కొత్త ఎక్సైజ్ స్టేషన్లు ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేపు ప్రారంభం కావాల్సిన కొత్త ఎక్సైజ్ స్టేషన్ల ప్రారంభం వాయిదా పడినట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అనుమతులు తీసుకున్న అనంతరం ఏప్రిల్ 3వ తేదీన కొత్త పోలీస్ స్టేషన్ల ప్రారంభానికి ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి డివిజన్లోని గండిపేట కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను, సంగారెడ్డి పరిధిలో అమీన్‌పురా పోలీస్ స్టేషన్లను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లితో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ఎం రిజ్వి, ఎక్సైజ్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఎక్సైజ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మిగిలిన ఎక్సైజ్ స్టేషన్లను ఆయా ప్రాంతాల్లోని అధికారుల ప్రారంభించనున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం 2020లోనే 14 కొత్త ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి, వీటి కోసం సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి, సిబ్బందిని సైతం కేటాయించింది. వీటి ప్రారంభానికి ఎన్నికల కోడ్ అడ్డంరావడం, ప్రభుత్వం మారడంతో 15నెలల సమయం పట్టింది. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ ఆమోదముద్ర వేయడంతో రేపు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ ఈలోపు జీహెచ్ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావడంతో మరోసారి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు 3వ తేదీకి వాయిదా పడింది. అలాగే కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు అద్దె భవనాలను గుర్తించాలని ఆదేశించడంతో అద్దె భవనాల గుర్తింపు దాదాపు పూర్తయింది. ప్రతీ కొత్త ఎక్సైజ్పోలీస్స్టేషన్కు ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు.