హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) జూలై 15 నుంచి అమల్లోకి రానున్నది. అదే తేదీ నుంచి ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టు తొలి సమావేశం శనివారం సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఈహెచ్ఎస్ మార్గదర్శకాలపై ట్రస్టు బోర్డు సభ్యులతో చర్చించారు. జూలై 15 నుంచి ఈ పథకం ప్రారంభిస్తామని, వారంలో సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు/ పెన్షనర్లు అయితే ఒకరి నుంచే చందా మినహాయించనున్నారు. గతంలో అదనంగా కట్‌చేసిన ప్రీమియాన్ని తిరిగి చెల్లిస్తారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తామని అధికారులు ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. మారం జగదీశ్వర్ (టీఎన్జీవో), ఏలూరి శ్రీనివాసరావు (టీజీవో), పుల్గం దామోదర్‌రెడ్డి (పీఆర్టీయూ టీఎస్), సీహెచ్ రవి (టీఎస్ యూటీఎఫ్), గిరి శ్రీనివాస్‌రెడ్డి (సచివాలయ ఉద్యోగుల సంఘం), జీ సదానందంగౌడ్ (ఎస్టీయూ టీఎస్) వీ లచ్చిరెడ్డి (డిప్యూటీ కలెక్టర్ల సంఘం), పేరి వెంకట్‌రెడ్డి (తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్), ఆర్ ఉమాదేవి (తెలంగాణ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్) తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మరో ఐదారు రోజుల్లో దవాఖానల ప్రతినిధులతో వైద్యారోగ్యశాఖ అధికారులు, ట్రస్టు సభ్యులు సమావేశం కానున్నారు. అప్పుడే ప్యాకేజీ రేట్లు, ఎంప్యానల్డ్ దవాఖానల జాబితాను ఖరారు చేయనున్నారు. మొత్తం 1885 వ్యాధులు, 514 ఎంప్యానెల్డ్ దవాఖానలు ఈ పథకం పరిధిలో ఉన్నట్టు సమాచారం. ఉద్యోగి అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆరు విడుతల ప్రక్రియ ఉంటుంది. ఓపీ, డయగ్నాస్టిక్లు ఈ పథకం పరిధిలోకి రావు. కేవలం అడ్మిట్ అయినప్పటి నుంచే ఈ పథకం వర్తిస్తుంది. ఒక రోగికి ఒకసారి రూ.2లక్షల వరకు చికిత్స అందిస్తుండగా.. దీనిని ఐదు లక్షలకు పెంచాలన్న డిమాండ్ సమావేశంలో చర్చకు వచ్చింది. జీవో -174, 175, 176, జీవో 97, 98లోని సమగ్ర మార్గదర్శకాలను కొనసాగిస్తూ, కొన్ని కొత్త మార్పులు కూడా తీసుకురానున్నారు. అయితే జూలై 15 నుంచి ఈ స్కీమ్‌ను వర్తింపజేయడంపై ఉద్యోగులు, టీచర్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.