Telangana | హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరోసారి బదిలీల ప్రహసనం మొదలయ్యింది. ఒక అధికారి జిల్లాకు వచ్చి కుదురుకోవడమే ఆలస్యం.. బదిలీ అవుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి స్థానచలనం కల్పించడం గమనార్హం. 20జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత చేసిన బదిలీలు ప్రహసనంగా మారుతున్నాయనడానికి తాజాగా శనివారం చేసిన బదిలీలు కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి. నల్గొండ జిల్లా కలెక్టర్గా ఉన్న దాసరి హరిచందన మరోమారు బదిలీ అయ్యారు. ఆమెకు ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అంతకు ముందు ఆమె కొన్ని నెలలపాటు ఆయూష్ శాఖ, ప్రజావాణి ఇన్ఛార్జిగా, కొంతకాలం వెయిటింగ్లో, అంతకు ముందు జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్గా, నారాయణపేట కలెక్టర్గా పనిచేశారు. గడిచిన మూడేళ్లలోనే ఆమె ఇన్ని చోట్లకు బదిలీ అయ్యారు. రెండేళ్ల క్రితం భువనగిరి కలెక్టర్గా ఉన్న పమేలా సత్పతిని కూడా గత ఎనిమిది నెలల్లోనే మూడుసార్లు ట్రాన్స్ఫర్ చేశారు. పురపాలక శాఖ డైరెక్టర్గా ఉన్న ఆమెను ఏడు నెలల క్రితం కరీంనగర్ కలెక్టర్గా వేశారు. ఇప్పుడు అక్కడి నుంచి వెకెన్సీలో పెట్టారు. కరీంనగర్లో ఆమె ఏడు నెలలు మాత్రమే పనిచేశారు.
పోస్టింగ్లు లేకుండానే కొంతమంది…
తాజా బదిలీల్లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్, భూపాలపల్లి కలెక్టర్ భవేష్ మిశ్రా, జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా, నల్గొండ కలెక్టర్ హరిచందన, సూర్యాపేట కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి పోస్టింగ్ ఇవ్వలేదు. కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆలకు పోస్టింగ్ ఇవ్వలేదు.