హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించునన్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో కలిసి రంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్-మలాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
మొదటి దశలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరువు, మేడ్చల్ మలాజ్ గిరి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్‌లో, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీలో, గండిపేట, శేరిలింగంపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం, మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్ మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ నెలలోనే దీనికి శంఖుస్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఒక మోడల్ గా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, గోలొ ండ మూడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను షేక్ పేట్ ప్రాంతంలో ఒకేచోట నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు.