Social media | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఏనాడైనా తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడిని నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర నేతల ప్రోద్బలంతో తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని, తెలంగాణ సమాజం మేల్కొని ఖండించాలని పలువురు చర్చించుకుంటున్నారు. తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించే గులాబీ పార్టీకి అండగా నిలవాలని నవీన్ అనే నెటిజన్ మద్దతు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర కలలను సాకారం చేసిన కేసీఆర్‌తోనే తెలంగాణకు రక్షణ అని మానస అనే నెటిజన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడి వీడియోలు, గాంధీ అనుచరుల రౌడీయిజం తదితర వీడియోలన్నీ సోష ల్ మీడియాలో షేర్ చేస్తూ ఖండించారు. శాం తిభద్రతల విషయంలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉండేదని.. అలాంటి తెలంగాణను ఆంధ్రనేతల కుట్రతోనే అణగదొక్కాలని చూస్తున్నారని ప్రకాశ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ దాడి వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే తమ పప్పులు ఉడకవని గ్రహించి ఆ పార్టీకి చెందిన నేతలపై దాడులు చేస్తున్నారని సతీశ్ అనే నెటిజన్ సందేహం లేవనెత్తారు. అరికెపుడి గాంధీ రాజీనామా చేసి సవాల్ విసరాలి.. పోలీసుల సహకారంతో కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయడం సిగ్గుచేటని సుశీలారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసింది.
హరీశ్‌రావు వీడియో వైరల్
‘మీరు విసిరే రాళ్లు.. రేపటి మా ప్రభుత్వానికి పునాది రాళ్లు” అని హరీశ్‌రావు అన్న వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌పైనా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రేవంత్ సర్కార్ తన పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని నెటిజన్లు ఎద్దేవా చేశారు. మొత్తంగా సోషల్ మీడియా అంతా బీఆర్ఎస్ వెంట నిలవడం విశేషం.