తనకంటే గొప్పవారు లేరంటూ తరచూ సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసి అభాసుపాలయ్యారు.
ఈసారి ఓ అడుగు ముందుకేసి స్వాతంత్య్రం తర్వాత తనకంటే ఎక్కువ గౌరవం పొందిన వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజన అనంతరం రెండు తెలుగు రాష్ర్టాల్లో లేరంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు.
బాబు తాజా వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. దేశం బానిస సంకెళ్లు తెంపుకోవడానికి కారణం కూడా తానే అని చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఏకిపారేస్తున్నారు.
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు బడాయి లు ఇప్పటికీ ఆగడం లేదు. బాబు డాబుల డప్పు మోగుతూనే ఉన్నది. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధాని మోదీకి తేల్చిచెప్పినట్టు చంద్రబాబు వెల్లడించారు. తన ఒత్తిడితోనే వాటిని ఏపీకి ఇస్తూ కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చిందని స్పష్టం చేస్తూ ఏడు మండలాల విలీనంపై పన్నిన ఎత్తుగడ, కుట్రలను చంద్రబాబే స్వ యంగా ఒప్పుకోవడం గమనార్హం. ఇందుకు బీజేపీ, ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ చూపారంటూ కుట్ర లో వారి భాగస్వామ్యంపైనా నిగ్గుతేల్చారు. ఏపీ లో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమని, తన హయాంలో
ఇంకుడు గుంతలు తవ్వి, చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే ఎగతాళి చేశారని గ్రౌండ్‌వాటర్‌ను రీచార్జ్ చేసిన ఘనత తనదే అని బాబు తన మార్కు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ఏపీ రిజర్వాయర్లలో 780 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, వాటిని చూస్తే ఆనందంగా ఉందని, అసలు వర్షాల కోసం చూడాల్సిన పరిస్థితులే లేకుండా చేశామని మరీ గొప్పలకు పోయారు.
హైదరాబాద్‌కు నీళ్లూ నా ఘనతే!
తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తిని తానే ప్రారంభించానని చెప్పుకొచ్చిన బాబు దేశంలోనే అతి పెద్ద లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు ‘మాధవరెడ్డి’ తనే ప్రారంభించానని పోజులకు పోయారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం 20 టీఎంసీల నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశామని, ఆర్డీఎస్లో నీళ్లు రాకపోతే జూరాల లింకు కెనాల్ పెట్టి మహబూబ్‌నగర్‌లో 40వేల ఎకరాలకు నీళ్లిచ్చామని వెల్లడించారు. నిజామాబాద్‌లో గోదావరిపై అలీసాగర్, గుత్ప ప్రాజెక్టులను ప్రారంభించాననీ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మంజీరా నుంచి వారానికోసారి నీళ్లిచ్చే స్థాయిని తొలిసారి నాగార్జున సాగర్ నీళ్లు తెచ్చి మార్చామనీ బిల్డప్ ఇచ్చారు. తెలుగు జాతికి బ్రహ్మాండమైన నగరం ఉండాలని హైదరాబాద్‌లో బెస్ట్ ఎకో సిస్టమ్ తీసుకొచ్చామని, మోస్ట్ లివబుల్ సిటీగా మార్చినట్టూ గొప్పలు చెప్పారు. ఔటర్, ఎయిర్‌పోర్టు, హైటెక్‌సిటీ, సైబరాబాద్, బయోటెక్నాలజీ, ఫార్మా, ఇన్యూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటివన్నీ తానే పెట్టినట్టు పలికి నవ్వాలో.. ఏడ్వాలో తెలియని పరిస్థితి కల్పించారు చంద్రబాబు.