హైదరాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో చదువుకున్నారని, తెలంగాణ పౌరుషం గురించి తెలియదంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఆంధ్రాలో చదువుకోవడానికి, తెలంగాణ పౌరుషానికి సంబంధమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన వ్యక్తినే అల్లుడిగా చేసుకున్న రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌పై నోరుపారేసుకోవడం విడ్డూరంగా ఉన్నదని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో భీమవరం మామ తాలుకా అనే సెటైర్ సోషల్‌మీడియాలో ట్రెండ్ నడుస్తున్నది. గురువారం బీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ క్రిశాంక్ కూడా భీమవరం మామ తాలుకా అనే టైటిల్ ముద్రించిన టీషర్ట్ ధరించి మీడియాతో మాట్లాడటం గమనార్హం. అది గులాబీ శ్రేణులు వైరల్ చేయడంతో సీఎం సెల్ఫ్‌గోల్ వేసుకున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తూ మీమ్స్ చేస్తున్నారు.