(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): అనుకున్నదే అయ్యింది. మూసీ నదికి, దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రవహిస్తున్న చుంగ్ గై చున్ వాగుకు అసలు పోలికే లేదని, ఆ ప్రాజెక్టు ప్లానింగ్, మూసీ ప్రాజెక్టుకు ఏ మాత్రం సరిపోలదని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆదివారం డాక్యుమెంట్లు, ఫొటోలతో ప్రత్యేక కథనంలో వివరించింది. అయినప్పటికీ, ఇదేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెట్టి 20 మందితో కూడిన ఓ బృందాన్ని సియోల్ పర్యటనకు పంపించింది. తీరా.. చుంగ్ గై చున్ వాగును చూసిన బృంద సభ్యులు ఒకింత షాక్‌కు గురైనట్టు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోలను బట్టి తెలుస్తున్నది. ‘ఇది నది కాదు. పిల్ల వాగు’ అని బృందంలోని ఒకరు, ‘దీన్ని చూడటానికి ఇంత దూరం వచ్చామా?’ అని మరో సభ్యుడు గుసగుసలాడుకొన్నట్టు సమాచారం. ‘ఈ వాగుకు సుందరీకరణ కూడా అవసరంలేదు’ అని బృందంలోని మరో సభ్యుడు వాపోవడం వీడియోలో కనిపిస్తున్నది.
రియల్ ఎస్టేట్‌పైనే చర్చ
చుంగ్ గై చున్ వాగు పరిసరాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కూడిన బృందం పర్యటిస్తున్న సమయంలో సభ్యుల మధ్య వాగు నీటి శుద్ధికి సంబంధించిన ఏ ఒక్క చర్చ కూడా జరుగలేదని తెలుస్తున్నది. పైగా వాగు చుట్టుపక్కల నిర్మించిన భారీ భవనాలు, రియల్ ఎస్టేట్‌పై బృంద సభ్యుల మధ్య పెద్దఎత్తున చర్చ జరిగినట్టు వీడియోలను బట్టి అర్థమవుతున్నది. దీంతో మూసీ పునరుజ్జీవం కోసం సియోల్ పర్యటన చేపట్టినట్టు కనిపించట్లేదని, మూసీ పరీవాహకంలో రియల్‌ఎస్టేట్‌ను ప్రోత్సహించడానికి కావాల్సిన స్ఫూర్తి పొందడానికే ఈ టూర్‌ను చేస్తున్నట్టు కనిపిస్తున్నదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. రూ. కోట్ల ప్రజాధనాన్ని ఇలాంటి పర్యటనల పేరిట ఖర్చు చేయడం ఏమిటని? రేవంత్ ప్రభుత్వాన్ని నెటిజన్లు నిలదీస్తున్నారు.
టూర్‌పై నెటిజన్ల ట్రోలింగ్
కాంగ్రెస్ మంత్రుల సియోల్ పర్యటనపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘నిజంగా ఇది అధికారిక పర్యటన అయితే, కొరియా ప్రతినిధులు ఎక్కడ?’ అని సీతారామ్ అనే ఓ నెటిజన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పర్యటన మూసీ బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నట్టు కనిపించట్లేదని, లూటిఫికేషన్ ఎజెండాగా ఈ టూర్ సాగుతున్నట్టు కనిపిస్తున్నదని సామ్యూల్ జాన్సన్ అనే మరో నెటిజన్ మండిపడ్డారు. ‘ఈపాటి పిల్ల కాలువను చూడడానికి సియోల్ వెళ్లడం ఎందుకు?’ అని రఘునందన్ అనే మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. ‘వాగు పక్కనే ఉన్న బిల్డింగ్లు కూడా బఫర్ జోన్లో ఉన్నాయని మన రేవంత్ సర్కారు కూల్చేస్తుందేమో?’ అని ఆదిత్య అనే ఇంకో నెటిజన్ చమత్కరించారు. మొత్తానికి కాంగ్రెస్ మంత్రుల సియోల్ యాత్ర ఓ అట్టర్‌ఫ్లాప్‌గా మారిందన్న విమర్శలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
కొరియా ప్రతినిధులెక్కడ?
ప్రభుత్వం తరుఫున ఓ బృందం విదేశీ పర్యటన చేసినప్పుడు ఆ దేశ ప్రభుత్వాధికారులు లేదా ప్రతినిధులు దగ్గరుండి పర్యటన చేయిస్తారు. పర్యటన మొదలు పూర్తయ్యే వరకూ బృంద సభ్యులతో ఉంటూ తమ దేశంలోని ప్రాజెక్టులను సమగ్రంగా వివరిస్తారు. చుంగ్ గై చున్ వాగును పరిశీలిస్తున్న సమయంలో తెలంగాణ నుంచి వెళ్లిన బృందం మినహా అక్కడ సియోల్ ప్రభుత్వ ప్రతినిధులెవ్వరూ హాజరుకాలేదని తెలిసింది.