Vikarabad | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ భూసేకరణకు వెళ్లిన అధికారులపై సోమవారం జరిగిన రైతుల దాడిని నెటిజన్లు ‘నందిగ్రామ్’ ఘటనతో పోలుస్తున్నారు. 2007లో పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో రైతులపై హింసాత్మక ఘటన చోటుచేసుకొన్నది. పోలీసుల కాల్పు ల్లో 14 మంది రైతులు ప్రాణాలు విడిచారు. బెంగాల్‌లోని నందిగ్రామ్ ప్రాంతంలో సలీం గ్రూప్ ఆఫ్ ఇండోనేషియా కెమికల్ కంపెనీతో పాటు కెమికల్ సెజ్ కోసం అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం 10 వేల ఎకరాల భూ సేకరణ చేపట్టాలని ప్రయత్నించింది.
మార్చి 14, 2007లో భూ సర్వే కోసం అప్పటి కలెక్టర్, ఇతర రెవెన్యూ సిబ్బంది పరిసర గ్రామాల్లో పర్యటించారు. కెమికల్ ఫ్యాక్టరీతో తమ ఆరోగ్యాలు చెడిపోతాయని, పచ్చని భూములు నాశనమవుతాయని గ్రామస్థులు ఎదురుతిరిగారు. తమ భూములను ఇచ్చేదిలేదంటూ అధికారులను కర్రలు, రాళ్లతో తరిమిగొట్టారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా 14 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సంచలనమైంది. ప్రజాగ్రహం పెరిగిపోతుండటంతో భూసేకరణ నిర్ణయాన్ని అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం పక్కనబెట్టింది. ఈ ఘటన కారణంగానే 2011లో లెఫ్ట్ సర్కార్ బెంగాల్లో అధికారాన్ని కూడా కోల్పోయింది. తృణమూల్ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.