హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్ర పరిపాలన భవనాన్ని ఇక నుంచి ‘నో ఫ్లైజోన్’లో ఉంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సచివాలయం చుట్టూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సెక్రటేరియట్‌పై, చుట్టుపక్కల డ్రోన్ ఎగరవేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సచివాలయం ప్రారంభోత్సవం దగ్గర్నుంచి నేటి వరకు రోజూ వేలాది మంది పర్యాటకులు అక్కడ ఫొటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. చాలామంది యువత ఆ చారిత్రక కట్టడం వద్ద బర్త్‌డేలు జరుపుకుంటూ.. ఆనందం పొందుతున్నారు. అక్కడ దృశ్యాలు చిత్రీకరించుకుంటూ మధుర జ్ఞాపకాలను పదిలపర్చుకుంటున్నారు. కాగా ఇటీవల ముగిసిన వినాయక చవితి నిమజ్జనాల్లో వినాయక విగ్రహాలు సచివాలయం ముందుకు రాగానే ఎనలేని శోభను సంతరించుకున్నాయి. తెలంగాణకు ఐకాన్‌గా ఉన్న ఈ అపూర్వ కట్టడం ఎదురుగా రాగానే చాలామంది భక్తులు వినాయకుడి పాటలకు నృత్యాలు చేస్తూ భక్తిని చాటుకున్నారు.
అదే సందర్భంలో కేసీఆర్ పాటలకు డ్యాన్సులు చేసి తమ అభిమానాన్ని వ్యక్తంచేశారు. నిమజ్జనాలు మొదలైన రోజు నుంచే వారం రోజులపాటు ‘దేఖ్ లెంగే..’ ‘మళ్లీ సారే రావాలంటున్నారే..’ ‘గులాబీల జెండలే రామక్క..’ వంటి పాటలు సచివాలయం వద్ద హోరెత్తాయి. ఆ పాటలకు డ్యాన్సులు చేస్తూ అభిమానులు తీసుకున్న ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక్కో వీడియోకు కోట్లలో వ్యూస్, లక్షలు, వేలల్లో లైకులు వచ్చాయి. అదొక ట్రెండ్‌గా మారడం, నిమజ్జనం రోజున కేసీఆర్‌పై అభిమానం కట్టలు తెంచుకోవడంతో.. నిమజ్జన ఏర్పాట్లు చూసేందుకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కూడా.. ఆ పాటల జోరును ఎక్కువసేపు చూడలేక నిమిషాల్లోనే అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఆ సందర్భంగా కొందరు అభిమానులు డ్రోన్లు ఎగురవేసి నిమజ్జనాన్ని, హడావుడి వాతావరణాన్ని కవర్ చేశారు.
నిమజ్జనమైన మరుసటి రోజు కూడా కేసీఆర్ పాటల జోరు తగ్గకపోవడంతో పోలీసులు కలుగజేసుకొని యాంప్లిఫైర్లు, డీజేలు తీసుకొని, నిర్వాహకులపై కేసులు పెట్టారు. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా సచివాలయాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ నిర్మించిన అద్భుతమైన సచివాలయ భవనాన్ని చూసి రేవంత్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారని మండిపడుతున్నారు. కేసీఆర్ ఖ్యాతిని కెమెరాల్లో బంధించకుండా చూసినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి చెరిపివేయడం రేవంత్‌రెడ్డి వల్ల కాదని తేల్చిచెప్తున్నారు.
సచివాలయ ఉద్యోగులకు తాగునీటి కష్టాలు
రాష్ట్ర సచివాలయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కనీసం ఉద్యోగులకు తాగునీటిని కూడా అందించే పరిస్థితి లేకుండా పోయింది. సచివాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తాగునీటిని కూడా కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉద్యోగులు, సిబ్బంది తాగునీటి అవసరాలు తీర్చడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫయర్లకు ఏడాది క్రితం మరమ్మతులు చేయించాల్సి ఉంది. కనీసం వాటిని బాగు చేయించాల్సిన అధికారులు.. వాటివైపు కన్నెత్తి చూడటంలేదు. దీంతో ఉద్యోగులు నిత్యం గొంతు తడుపుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత డబ్బులతో వాటర్క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏటా తాగునీరు, నిర్వహణ ఖర్చులకు శాఖల వారీగా బడ్జెట్ కేటాయిస్తుంది. అయినా తాగునీటి కోసం ఉద్యోగుల నుంచి నెలకు రూ.300 నుంచి రూ.400 వరకు సొంత డబ్బులు వెచ్చించాల్సిన వస్తున్నదని ఉద్యోగులు వాపోతున్నారు. ఏడాది నుంచి సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడంలేదు. సాధారణంగా సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణను ప్రభుత్వమే తీర్చాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక నిధులను ప్రతి మూడు నెలలకు ఒక సారి కేటాయిస్తుందని ఉద్యోగులు చెప్తున్నారు. కానీ సెక్షన్ ఆఫీసర్లు మాత్రం ప్రభుత్వం నుంచి వస్తున్న నిర్వహణ డబ్బులను కూడా వాటర్ క్యాన్స్ కొనుగోలు కోసమే వెచ్చిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వీరి వైఖరిపై కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరి ప్రభుత్వ అలసత్వం, అధికారుల కక్కుర్తికి తాము ఇబ్బంది పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు.