హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్తు కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుండగా, మరోవైపు కరెంటు సమస్యలపై ట్విట్టర్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్తు కోతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పోస్టులు పెడుతున్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ..
‘మేము అధికారంలో ఉంటే ఏమైనా చేసేవాళ్లం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మార్పు తెస్తామనే హామీతో వారు అధికారంలోకి వచ్చారు. మీ ట్వీట్లు విద్యుత్తు శాఖ మంత్రికి చేరే విధంగా ప్రయత్నిస్తాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కరెంట్ కోతలే లేవని ప్రకటిస్తున్న విద్యుత్తుశాఖ మంత్రి భట్టి విక్రమారను ట్యాగ్ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను రీట్వీట్ చేశారు.
పదేండ్లకు మళ్లీ చీకట్లు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయి. కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయి. విద్యుత్తు కోతలే లేకుండా పవర్ సెక్టార్లో బీఆర్ఎస్ సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని స్థితిలో రేవంత్రెడ్డి సరారు ఉన్నదన్న విమర్శలు మొదలయ్యాయి. 2014కు ముందు తరుచూ విద్యుత్తు కోతలు, పవర్ హాలిడేస్ తెలిసిందే. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత కేసీఆర్ సరార్దే. 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయటం వల్ల అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోయే పరిస్థితి వచ్చింది.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పదేండ్ల క్రితం నాటి పాత రోజులను తిరిగి తీసుకొచ్చిందని నెటిజన్లు మండిపడుతున్నారు. తరుచూ విద్యుత్తు కోతలతో అటు ప్రజలకు, ఇటు పరిశ్రమలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యుత్తు కోతలు లేకుండా కేసీఆర్ చేసిందేమిటని కొందరు అడుగుతున్నారు.. వాళ్లకోసం ఈ వివరాలు అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ హయాంలో ప్రగతి ఇలా…