Nellutla Ramadevi | హైదరాబాద్ : రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం వరించింది. కవయిత్రి నెల్లుట్ల రమాదేవిని అందెశ్రీ కమిటీ ఎంపిక చేసింది. ఈ నెల 9వ తేదీన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నెల్లుట్ల రమాదేవికి పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా రమాదేవికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు.
2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌ను కాళోజీ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. 2023 సంవత్సరానికిగాను ప్రముఖకవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్‌ను వరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి ఏడాది కాళోజీ జయంతి సందర్భంగా.. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కాళోజీ నారాయణ రావు అవార్డును అందజేయడం ప్రారంభించారు.
ఇందులో భాగంగా 2015 నుంచి ఏటా ప్రముఖ సాహితీవేత్తను ఒకరిని ఎంపికచేసి వారికి కాళోజీ పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న ఈ అవార్డును ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అవార్డు కింద రూ.జ్ఞాపికతోపాటు రూ.1,01,116 నగదు బహుమతిని అందిస్తున్నారు.