హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): మార్క్‌ఫెడ్ ఎండీలు మారినా తమ తలరాత మారడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మక్క, జొన్న రైతుల గోస ఉన్నతాధికారులకు పట్టడంలేదనే విమర్శలొస్తున్నాయి. కొనుగోళ్లలో ఆలస్యంతో ఒకవైపు రైతులు ఎండలో మాడిపోతుంటే, సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా సమీక్ష నిర్వహించి ఆగ్రహం వ్యక్తంచేసినా అధికారులు మాత్రం హైదరాబాద్‌ను విడిచి క్షేత్రస్థాయికి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కొనుగోళ్ల భారం మొత్తం కలెక్టర్లు, జిల్లా డీఎంలపై మోపి ఉన్నతాధికారులు నింపాదిగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని ఈ నెల 9వ తేదీన బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రాహుల్‌రాజ్‌ను ఎండీగా నియమించింది. కొత్త ఎండీ వచ్చి వారం రోజులవుతున్నా జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులతో కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని తెలిసింది. మెజారిటీ డీఎంలు కొత్త ఎండీతో కనీసం ఫోన్లోనైనా మాట్లాడిన పరిస్థితి లేదని, పరిచయంలేదని సమాచారం. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కలెక్టర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో మాత్రమే డీఎంలను చూసినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఎండీలు మారినా కొనుగోళ్లలో సమస్యలు మాత్రం తీరడంలేదని, తమ ఇబ్బందులు పట్టించుకునేవారే కరువయ్యారని డీఎంలు ఆవేదన వ్యక్తంచేస్తుండటం గమనా ర్హం. స్థానికంగా రైతులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నాయని చెప్తున్నారు.
జొన్నల కొనుగోళ్లకు సంబంధించి మార్క్‌ఫెడ్ ఎండీ ఈ నెల 19న మార్గదర్శకాలు జారీ చేశారు. కానీ, కొనుగోళ్ల కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై ఇప్పటివరకు సమీక్ష నిర్వహించలేదని తెలిసింది. ఒకవైపు, ఇప్పటికే మక్కల కొనుగోళ్లకు గన్నీలు, లారీలు, గోదాములు లేకపోవడంతో స్థానికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.