SSC Exams | ఖమ్మం అర్బన్, మార్చి 29 : పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థుల జీవితాలతో విద్యాశాఖ అధికారులు ఆటలాడుకుంటున్నారు. ఎంతో పకడ్బందీగా తరలించాల్సిన జవాబు పత్రాలను పోస్టాఫీస్ నుంచి తరలించే సమయంలో ప్యాకింగ్ చినిగిపోయి సమాధాన పత్రాలు బయటకు కనిపిస్తున్నా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే తరలించడం వివాదాస్పదంగా మారింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రానికి సంబంధించిన సమాధాన పత్రాలు జిల్లా కేంద్రానికి తరలించే సమయంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన అధికారుల బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతున్నది.
ఈ విషయమై ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ శనివారం డీఈవో, ఆర్డీవోలను విచారణకు ఆదేశించారు. ఇద్దరు అధికారులు సమాధాన పత్రాలను నిల్వ చేసిన ఖమ్మం రైల్వే స్టేషన్‌లోని ఆర్ఎంఎస్ పాయింట్‌కి వెళ్లి పత్రాలను పరిశీలించారు. ప్యాకింగ్ తొలగినా సమాధాన పత్రాలు సురక్షితంగానే ఉన్నాయని కలెక్టర్‌కు నివేదిక అందించారు. మళ్లీ పోస్టల్ అధికారుల చేత భద్రంగా ప్యాకింగ్ చేయించారు.