హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నెరవేర్చేందుకు సతమతమవుతున్నదని సుపరిపాలన వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం అధ్వానంగా తయారైందని, గాంధీ, ఉస్మానియా వంటి ప్రధాన దవాఖానల్లో మందులు లేవని మండిపడ్డారు.
ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ధర్మాసుపత్రుల్లో ఓపీ లు మాత్రమే నడుస్తున్నాయని, ఫార్మసీల్లో మందులు లేకపోవడంవల్ల ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులాల్లోనూ కలుషితాహారం ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ఉచితాలకు బ్రేకులు వేసి నాణ్యమైన విద్య, వైద్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు.
హైడ్రా బాధితులకు ప్రభుత్వం స్థలం కేటాయించాలి
హైడ్రా చేపడుతున్న చర్యలపై పద్మనాభరెడ్డి స్పందిస్తూ, పేదలు, మధ్యతరగతి వర్గాలపై మానవీయ కోణంలో వ్యవహరించాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యల కు ప్రభుత్వం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని అనుమతులూ ఉండటం తో పేద, మధ్యతరగతి వర్గాలు కూడబెట్టుకున్న సొమ్ముతో ఇండ్లను కొనుగోలు చేశార ని, ఇప్పుడు వాటిని కూలగొట్టడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయనే భరోసాతో కొనుగోలు చేసినవారికి మరోచోట ప్రభుత్వం స్థలా లు కేటాయించాలని కోరారు.